Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో చలి పులి ... గత పదేళ్లలో అత్యధికం !

By:  Tupaki Desk   |   11 Nov 2020 5:30 PM GMT
హైదరాబాద్ లో  చలి పులి ... గత పదేళ్లలో అత్యధికం !
X
నగరవాసులను చలి గజ...గజ లాడిస్తోంది. రెండు రోజులుగా పెరుగుతున్న చలిగాలుల తీవ్రతతో ప్రజలు బయట అడుగుపెట్టేందుకు వణికిపోతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండడంతో ఉదయం తొమ్మిది గంటల వరకూ చలి తీవ్రత కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌ లో రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. నవంబరు నెలలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ కనీస ఉష్ణోగ్రత 12.8 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది.

జాతీయ వాతావరణ శాఖ ప్రకారం ఇది సాధారణం కంటే 5.8 డిగ్రీల సెల్సియస్ తక్కువ. గత పదేళ్లలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం కేవలం రెండో సారి మాత్రమే. ఇప్పటివరకు 2012, నవంబరు 18 తో పాటు 2016, నవంబరు 11న అత్యంత కనిష్టంగా 12.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 2010 డిసెంబర్‌ 21న 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకాగా 7 ఏళ్ల తర్వాత తిరిగి 2018 లో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో ఆల్‌టైం రికార్డుగా 1966 డిసెంబర్‌ 14న 7.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.