Begin typing your search above and press return to search.

అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి... మిస్ ఫైర్ పై అనుమానాలు..!

By:  Tupaki Desk   |   7 Feb 2023 4:20 PM GMT
అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి... మిస్ ఫైర్ పై అనుమానాలు..!
X
అమెరికాలో తుపాకీ మిస్ ఫైర్ అయిన ఘటనలో తెలంగాణకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. సెక్యూరిటీ గార్డు నుంచి గన్ తీసుకొని పరిశీలిస్తుండగా మిస్ ఫైర్ వల్ల విద్యార్థి చనిపోయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం మేరకు అది మిస్ ఫైర్ కాదని.. తోటి విద్యార్థి కాల్పులు చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరకు చెందిన మహంకాళి అఖిల్ సాయి ఉన్నత చదువు కోసం 13 నెలల క్రితం అమెరికాకు వెళ్లాడు. అమెరికాలోని అలబామాలోని అబర్న్ యూనివర్సిటీలో అఖిల్ చదువుకుంటున్నాడు. అంతేకాకుండా సమీపంలోని ఓ గ్యాస్ స్టేషన్‌లో పార్ట్‌ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు.

కాగా అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గ్యాస్ స్టేషన్లోని సెక్యూరిటీ గార్డు వద్ద తుపాకీని అఖిల్ పరిశీలిస్తున్నాడు. ఈక్రమంలోనే తుపాకీ మిస్ ఫైర్ కాగా బుల్లెట్ అఖిల్ సాయి తలలోకి దూసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన అఖిల్ సాయిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందడం విషాదాన్ని మిగిల్చింది.

మిస్ ఫైర్ వల్లే అఖిల్ సాయి మృతిచెందినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సమాచారం మేరకు అఖిల్ సాయిని తోటి విద్యార్థి తుపాకీతో కాల్చినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే అతడు ఎందుకు అఖిల్ సాయిని తుపాకీతో కాల్చడనే విషయం మాత్రం తెలియాల్సి ఉంటుంది. ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటన జరిగినపుడు పక్కనే ఉన్న రవితేజ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

దీంతో అసలు విషయం ఏంటి అనేది త్వరలోనే క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే అఖిల్ సాయి మరణవార్తతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు మానవత్వంతో స్పందించి తమ కుమారుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్ కు తీసుకోవాలని వేడుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.