Begin typing your search above and press return to search.

మిస్ యూనివర్స్ సింగపూర్ గా తెలుగమ్మాయ్

By:  Tupaki Desk   |   18 Sep 2021 4:17 AM GMT
మిస్ యూనివర్స్ సింగపూర్ గా తెలుగమ్మాయ్
X
తెలుగు అందం విదేశీ వేదిక మీద వెల్లివిరిసింది. దీంతో తాజాగా టైటిల్ సొంతమైంది. మన తెలుగు అమ్మాయి తన అందంతో.. అంతకు మించిన తెలివితో సింగపూర్ ప్రజల మనసుల్ని దోచేసింది. దీంతో.. మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరు? ఎక్కడి వారు? ఈ టైటిల్ సాధన ఎలా సాధ్యమైందన్న విషయాల్లోకి వెళితే..

ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన బాన్న నందిత తాజాగా మిస్ యూనివర్స్ సింగపూర్ గా ఎంపికైంది. 21 ఏళ్ల ఈ తెలుగు యువకెరటం వార్తల్లో వ్యక్తిగా మారారు. నందిత స్వస్థలం శ్రీకాకుళం పట్టణంలోని చిన్నబజారులోని దూదివారి వీధి. వారికి ఇక్కడే సొంతిల్లు కూడా ఉంది. తండ్రి గోవర్దనరావు.. తల్లి మాధురి పాతికేళ్ల క్రితం సింగపూర్ కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తల్లిదండ్రులు ఇద్దరూ సివిల్ ఇంజనీర్లే.

ప్రస్తుతం తండ్రి ఏవియేషన్ సప్లయ్ చైన్ సీనియర్ మేనేజర్ గా పని చేస్తుంటే.. తల్లి మాధురి సివిల్ ఇంజినీర్ గా వ్యవహరిస్తున్నారు. ఆర్నెల్లుగా వివిధ అంశాల్లో జరిగిన పోటీల అనంతరం టాప్ సిక్స్ కంటెస్టెంట్లు ఫైనల్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన నందిత విజేతగా అవతరించారు.

తొలి నుంచి మోడలింగ్ అంటే ఇష్టం కావటం.. తన అభిరుచికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడు కావటంతో ఆమె తాజాగా టైటిల్ విన్నరైంది. ప్రస్తుతం మేనేజ్ మెంట్ కంప్యూటర్ సైన్స్ లో డ్యూయల్ డిగ్రీ చేస్తున్న నందిత.. టైటిల్ సాధనపై సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ డిసెంబరులో ఇజ్రాయిల్ లో జరిగే మిస్ యూనివర్స్ పోటీలకు హాజరు కానున్నట్లు చెప్పింది. అయితే.. తాను సింగపూర్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు చెప్పింది. మరి.. మన తెలుగమ్మాయికి ఆల్ ద బెస్టు చెప్పేద్దాం.