Begin typing your search above and press return to search.

అమెరికాలో మరో తెలుగు మహిళకు కీలక పదవి !

By:  Tupaki Desk   |   6 Aug 2021 5:30 AM GMT
అమెరికాలో మరో తెలుగు మహిళకు కీలక పదవి !
X
అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన మరో మహిళకు కీలక పదవి దక్కింది. అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ ఏఐడీ) మిషన్‌ డైరెక్టర్‌ గా వీనా రెడ్డి తాజాగా బాధ్యతలు చేపట్టారు. అగ్రరాజ్యానికి జో బైడెన్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాలోని భారత సంతతి వ్యక్తులకు వరుసగా కీలక పదవులు, అందలాలు దక్కుతున్నాయి. ప్రభుత్వ విభాగాలతోపాటు అంతర్జాతీయ సంస్థల్లోనూ మనోళ్లకు ప్రాధాన్యం దక్కుతున్నది. అమెరికా సీనియ‌ర్ ఫారిన్ స‌ర్వీస్‌ లో స‌భ్యురాలు అయిన వీణా రెడ్డి, మ‌న తెలుగు అమ్మాయి కావ‌డం విశేషం. భార‌త్‌ కు యూఎస్ ఎయిడ్ మిష‌న్ డైరక్ట‌ర్‌ గా ఆమె ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. యూఎస్ ఎయిడ్ త‌ర‌పున ఇండియాలో సేవ‌లు అందించ‌నున్న తొలి భార‌తీయ అమెరిక‌న్‌ గా ఆమె రికార్డు నెల‌కొల్పారు.

అమెరికా ప్ర‌భుత్వంలో ఉద్యోగం సంపాదించ‌డానికి ముందు వీణా రెడ్డి కార్పొరేట్ కంపెనీలో అటార్నీగా చేశారు. కొలంబియాలా యూనివ‌ర్సిటీ నుంచి డాక్ట‌రేట్ చేశారామె. చికాగో వ‌ర్సీటీలో బీఏ చేశారు. యూఎస్ ఎయిడ్ భార‌త ప్ర‌భుత్వంతో గ‌త ఏడు ద‌శాబ్ధాల నుంచి భాగ‌స్వామిగా ఉంద‌ని, ఈ బంధాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని ఆమె అన్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఇండియాతో పాటు ఇత‌ర దేశాల‌పైన తీవ్ర ప్ర‌భావం ప‌డింద‌ని, రెండు దేశాల మ‌ధ్య భాగ‌స్వామ్యంతో మెరుగైన భ‌విష్య‌త్తును నిర్మించ‌నున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు. దీంతో యూఎస్ఏఐడీ మిషన్‌ డైరెక్టర్‌గా ఎంపికైన తొలి భారతీయ అమెరికన్‌‌గా వీనా రెడ్డి రికార్డుకెక్కారు.

ఈ సందర్భంగా అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సందూ, భారత్‌ లో అమెరికా రాయబారి అతుల్ కేషప్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ప్రైవేట్ లాయర్‌గా కెరీర్ ప్రారంభించిన ఏడేళ్లలోనే వీనా యూఎస్ఏఐడీలో చేరడం విశేషం. ఇన్నాళ్లు ఆమె ఇదే ఏజెన్సీలో ఫారిన్‌ సర్వీస్‌ ఆఫీసర్‌గా పని చేశారు. రిజినల్ సీనియర్ అడ్వైజర్‌ గా మూడేళ్లు, పాకిస్థాన్‌ కు సీనియర్ లీగ్ అడ్వైజర్‌ గా ఒక ఏడాది పనిచేశారు. 2012లో అసిస్టెంట్ జనరల్ కాన్సుల్‌ గా విధులు నిర్వహిస్తున్న ఆమెను హైతీకి డిప్యూటీ మిషన్ డైరెక్టర్‌ గా బాధ్యతలు అప్పగించారు. అలాగే కంబోడియా మిషన్‌ డైరెక్టర్‌ గా 2017 ఆగష్టు నుంచి ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక వీనా రెడ్డి చికాగో యూనివర్శిటీలో పబ్లిక్ పాలసీ అండ్ సోషల్ సైన్స్‌ చదివారు. కొలంబియా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి డాక్టర్ ఆఫ్ లా డిగ్రీ పొందారు. ఆమెకు న్యూయార్క్‌, కాలిఫోర్నియా బార్‌ అసోషియేషన్‌లో సభ్యత్వం ఉంది.

కాగా, భారత్‌ లో అమెరికా ఎయిడ్ డైరెక్టర్ గా వీణా రెడ్డి నియామకానికి కొద్ది రోజుల ముందే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరో భారతీయ అమెరికన్‌ రషద్‌ హుస్సేన్‌ ను అంతర్జాతీయ మత స్వేచ్ఛ అంబాసిడర్‌ గా నామినేషన్‌ చేశారు. ఈ పదవికి ఎంపికైన తొలి ముస్లింగా రషద్‌ నిలిచారు. రషద్‌ హుస్సేన్ జాతీయ భద్రతా మండలిలో భాగస్వామి, అలాగే గ్లోబల్ ఎంగేజ్‌ మెంట్ డైరెక్టర్. రషద్‌ నియామకంపై అమెరికన్‌ యూదు కమిటీ యునైటెడ్ స్టేట్స్ అంబాసిడర్‌ గా నియమించినందుకు బిడెన్ పరిపాలనను ప్రశంసించింది. ఇదిలా ఉంటే, భారత్‌ సహా ఇతర దేశాలకు కరోనా టీకాల ఉత్పత్తిలో అమెరికా సహాయసహకారాలు అందిస్తుందని అధ్యక్షుడు బైడెన్‌ పేర్కొన్నారు.

ప్రపంచ దేశాలకు 50 కోట్ల డోసులు అందించడానికి తాము కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఈ నెలాఖరులో వాటి పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. తాము చేసే సాయం పూర్తిగా ఉచితమన్నారు. శ్వేతసౌధంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈమేరకు మాట్లాడారు. కరోనా ఉద్ధృతిని నివారించడంలో ప్రజాస్వామ్య దేశాల కృషి కీలకమన్నారు. కరోనాపై పోరులో టీకాల భాండాగారంగా నిలవాలని అమెరికా సంకల్పించిందన్నారు. కోవాక్స్‌ కార్యక్రమానికి ఇతర దేశాలకన్నా అధికంగా టీకాలు అందించామన్నారు. క్వాడ్‌ కూటమిలోని సహ సభ్య దేశాలైన భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలకు టీకాల ఉత్పత్తిలో సహకారం అందించినట్లు చెప్పారు. 8 కోట్ల డోసుల పంపిణీ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ఇప్పటివరకూ 65 దేశాలకు 11 కోట్ల డోసులు అందించామన్నారు.