Begin typing your search above and press return to search.

ఇవాల్టి నుంచి ఛాన‌ళ్ల‌కు అగ్నిప‌రీక్షేన‌ట‌!

By:  Tupaki Desk   |   13 Nov 2017 4:37 AM GMT
ఇవాల్టి నుంచి ఛాన‌ళ్ల‌కు అగ్నిప‌రీక్షేన‌ట‌!
X
రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో మీడియా నిర్వాహ‌ణ చాలా క‌ష్టంగా మారింది. మిగిలిన రంగాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. మీడియాలో మాత్రం భారీగా ఉద్యోగ‌వ‌కాశాలు వ‌చ్చాయి. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా మారిపోయి.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా మారిన వేళ‌.. దిన‌ప‌త్రిక‌లు.. టీవీ ఛాన‌ళ్ల‌కు నిర్వ‌హ‌ణ వ్య‌యం భారీగా పెరిగింది. ఆదాయం సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఖ‌ర్చు మాత్రం అంత‌కంత‌కూ పెరుగుతోంది.

ఓప‌క్క పోటీ.. మ‌రోప‌క్క పెరిగిన నిర్వ‌హ‌ణ వ్య‌యంతో ఇబ్బందిక‌రంగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. నిత్యం వార్త‌లు అందించే 24 గంట‌ల టీవీ చాన‌ళ్లు త‌ర‌చూ తీవ్ర అయోమ‌యానికి గుర‌య్యే ప‌రిస్థితి. ఈ రోజు వ్య‌వ‌హార‌మే తీసుకుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో లైవ్ లో ఏ స‌భ వ్య‌వ‌హారాలు ఇస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఏపీలో విప‌క్ష నేత పాద‌యాత్ర‌లో బిజీగా ఉన్న నేప‌థ్యంలో.. ఏపీ అసెంబ్లీలో నాట‌కీయ ప‌రిణామాల‌కు తావు లేదు. ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా సుదీర్ఘ‌కాలం సాగే స‌మావేశాలు కావ‌టంతో ఏదైనా అంశంపై నిర‌స‌న వ్య‌క్తం చేయ‌లేని ప‌రిస్థితుల్లో విపక్షాలు ఉన్నాయి. బ‌ల‌మైన అధికార‌ప‌క్షం.. దేనికైనా రెఢీ అనటం.. తేడా వ‌స్తే త‌ప్పును అంగీక‌రించి..ఆ ఇష్యూను ఫ‌టాప‌ట్ అంటూ తేల్చేసే కేసీఆర్ కార‌ణంగా తెలంగాణ అసెంబ్లీ సైతం అంత హాట్ హాట్ గా సాగుతున్న‌దేమీ లేదు. దీంతో.. ఏ అసెంబ్లీ స‌మావేశాన్ని ఛాన‌ళ్ల‌లో ఎక్కువ‌గా చూపించాల‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. కొన్ని మీడియా సంస్థ‌ల‌కు ఏపీ.. తెలంగాణ‌లో వేర్వేరు ఛాన‌ళ్లు ఉన్న‌ప్ప‌టికీ..చాలామందికి ఈ ప‌రిస్థితి లేదు.

సింగిల్ ఛాన‌ళ్ల ప‌రిస్థితి అయితే మ‌రింత దారుణంగా మారింది. పేరుకు ఒక‌టే ఛాన‌ల్ ఉంటే ఏ టైంలో ఏ అసెంబ్లీ స‌మావేశాల‌కు పెద్ద పీట వేయాల‌న్న‌ది అయోమ‌యానికి గురి చేస్తోంది. కొంత‌లో కొంత మెరుగైన విష‌యం ఏమిటంటే.. ఏపీ విప‌క్ష నేత నిర్వ‌హిస్తున్న పాద‌యాత్ర కార‌ణంగా టీవీ ఛాన‌ళ్లు కాస్తంత ప్ర‌శాంతంగా ఉన్నాయి. కాకుంటే ఇంచుమించు ఒకే టైంలో జ‌రిగే అసెంబ్లీని క‌వ‌ర్ చేయ‌టం ఛాన‌ళ్ల‌కు క‌ఠిన ప‌రీక్షేన‌ని చెప్పక త‌ప్ప‌దు.