Begin typing your search above and press return to search.

అక్కడేమో యాక్షన్ మూవీ..ఇక్కడేమో డాక్యుమెంటరీ

By:  Tupaki Desk   |   23 March 2017 5:21 PM GMT
అక్కడేమో యాక్షన్ మూవీ..ఇక్కడేమో డాక్యుమెంటరీ
X
ఒకే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. మీడియా ఛానళ్లు మొదలు.. దినపత్రికల వరకూ అందరి దృష్టి ఏపీ అసెంబ్లీ వైపే. బలమైన అధికార.. ప్రతిపక్షాలు ఉంటే రాజకీయం రంజుగా ఉంటుంది. ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఇదే తీరులో ఉంది. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. అన్ని మీడియా సంస్థలకు రెండు రాష్ట్రాలకు రెండు ఛానల్స్ లేని పరిస్థితి. ఉన్న ఒకట్రెండు ఛానళ్లు రెండు అసెంబ్లీ కార్యక్రమాల్నికవర్ చేస్తుంటే.. అలాంటి అవకాశం లేని మిగిలిన మీడియా సంస్థలు మాత్రం.. ఫోకస్ అంతా ఏపీ అసెంబ్లీ సమావేశాల మీదనే పెడుతున్నాయి.

బలమైన విపక్షం ఉండటం.. అడుగడుగునా అధికారపక్షానికి షాకుల మీద షాకులు ఇస్తున్న వైనంతో.. వారిని కంట్రోల్ చేయటానికి అధికారపక్షానికి కిందామీదా పడాల్సి వస్తోంది. ఇవాల్టికి ఇవాళ.. అగ్రిగోల్డ్ ఇష్యూను తెర మీదకు తీసుకొచ్చిన జగన్ కారణంగా.. అప్పుడెప్పుడో జరిగిపోయిన మహిళా పార్లమెంటరీ సదస్సు ఇష్యూను తెర మీదకు తెచ్చిన వైనం చూస్తేనే.. అగ్రిగోల్డ్ ఇష్యూలో ఏపీ సర్కారు ఎంత ఢిఫెన్స్ లో పడిందో ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.

ఒక్క అగ్రిగోల్డ్ విషయంలోనే కాదు.. రుణమాఫీ అంశంలోనూ.. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలోనూ జగన్ వినిపిస్తున్న వాదనకు ఏపీ అధికారపక్షం నోటి నుంచి మాటలు రాని పరిస్థితి. సబ్జెక్ట్ ను సూటిగా చెప్పకుండా.. వ్యక్తిగత విమర్శల్ని.. పాడిందే పాడరా అన్నట్లుగా సాగే ఆరోపణల్ని.. కోర్టుల్లో ఉన్న కేసుల గురించి అదే పనిగా ప్రస్తావిస్తూ అధికారపక్షం కాలం గడిపేస్తున్న వైనం కనిపిస్తుంది.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతుంటే.. మరోవైపు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అందుకు భిన్నంగా మారాయి. తిరుగులేని అధికారంతో పవర్ ఫుల్ గా ఉన్న తెలంగాణ అధికారపక్షాన్ని నిలువరిచటానికి కాంగ్రెస్ తో సహా.. విపక్ష నేతలంతా కిందామీదా పడుతున్నారు. కాస్తో..కూస్తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి.. భట్టి విక్రమార్క.. డీకే అరుణ లాంటి వారు మాట్లాడుతున్నా.. వాటిని సమర్థంగా తిప్పి కొట్టటంలో సక్సెస్ అవుతోంది తెలంగాణ అధికారపక్షం.

ఇక.. ఇష్యూల వారీగా పదునైన వాదనను వినిపిస్తారన్న పేరున్న బీజేపీ నేత కిషన్ రెడ్డి సైతం.. సభలో తేలిపోతున్నారు.ఆయన లేవనెత్తుతున్న విషయాలపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు విరుచుకుపడుతూ.. విపక్షాల నోట మాట రాకుండా చేస్తున్నారని చెప్పాలి. మొత్తంగా చూసినప్పుడు.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా యాక్షన్ మూవీ మాదిరి మారి అందరి దృష్టిని ఆకర్షించేలా చేస్తుంటే.. విపక్షాల వీక్ నెస్ కారణంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డాక్యుమెంటరీ మాదిరి మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/