ఒక తెలుగు టీచర్ కాలేజీ క్లాస్ రూంలో ఆత్మహత్య చేసుకున్న వైనం తీవ్ర కలకలంగా మారటమే కాదు.. భయాందోళనలకు గురి చేసింది. చెన్నైలోని అరుంబాక్కమ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. బుధవారం ఉదయం కాలేజీ ప్రారంభమైన తర్వాత.. విద్యార్థులు క్లాస్ రూంలోకి వచ్చి చూస్తే.. తెలుగు టీచర్ ఆత్మహత్య చేసుకొని ఉండటంతో భయాందోళనలకు గురయ్యారు.
తిరువల్లూరు జిల్లా కారంబాక్కమ్ కు చెందిన 32 ఏళ్ల హరి శాంతి గతంలోనూ ఇదే కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పని చేశారు. తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసిన ఆమె తర్వాత ప్రభుత్వ స్కూల్ టీచరుగా జాబ్ రావటంతో తన జాబ్ కు రిజైన్ చేసి వెళ్లిపోయారు.
అయితే.. అప్పుడప్పడు ఆమె కాలేజీకి వచ్చేవారు. కొన్నేళ్లుగా లెక్చరర్ గా పని చేసి ఉండటంతో ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేసే వారు కాదు. మంగళవారం మధ్యాహ్నం కాలేజీకి వచ్చిన ఆమె తిరిగి ఇంటికి వెళ్లలేదు. ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. రాత్రంతా క్లాస్ రూంలోనే ఉండిపోయిన ఆమె.. తర్వాతి రోజు ఉదయానికి విగతజీవురాలిగా కనిపించింది. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. పోలీసులు ఈ అంశం మీద విచారణ జరుపుతున్నారు. ప్రేమ వ్యవహారంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. అయితే.. మంగళవారం రాత్రి ఆమె ఒక్కరే ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే.. అసలేం జరిగిందన్న విషయాల మీద పోలీసులు ఫోకస్ పెట్టారు.