Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్లో ఇరుక్కున్న తెలుగు విద్యార్ధులు

By:  Tupaki Desk   |   31 Jan 2022 5:30 AM GMT
ఉక్రెయిన్లో ఇరుక్కున్న తెలుగు విద్యార్ధులు
X
విదేశాల్లో చదువుకోవాలన్న కోరికతో ఉక్రెయిన్ వెళ్లిన తెలుగు విద్యార్థులు ఇరుక్కుపోయారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజురోజుకు యుద్ధ వాతావరణం పెరిగిపోతోంది. రెండు దేశాల సరిహద్దులో రష్యా ఆయుధ సామగ్రిని, బలగాలను మోహరించింది. ఏ నిముషంలో అయినా ఉక్రెయిన్ పైకి దాడి మొదలుపెట్టాలన్న పద్దతిలో రష్యా వ్యవహరిస్తోంది. ఒకసారి దాడులు మొదలైతే దాన్ని ఆపటం చాలా కష్టమని అందరికీ తెలిసిందే.

ఎందుకంటే రష్యా స్థాయిలో అది దాడి మొదలుపెడితే ఉక్రెయిన్ కూడా దాని స్ధాయిలో వెంటనే రియాక్టవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి రెండు దేశాలూ పూర్తిస్ధాయి యుద్ధానికి దిగితే పరిస్థితులు ఎక్కడిదాకా వెళతాయో ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. దేశంగా రష్యాతో పోల్చితే ఉక్రెయిన్ చాలా చిన్నదే అయినా రష్యాను వ్యతిరేకించే అమెరికా లాంటి దేశాలన్నీ వెంటనే ఉక్రెయిన్ కు అండగా రంగంలోకి దిగుతాయి.

రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం, ఉద్రిక్తత పెరిగిపోతున్న కారణంగా ఉక్రెయిన్ లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక అంచనా ప్రకారం ఉక్రెయిన్ లో తెలంగాణా, ఏపీకి చెందిన సుమారు 200 మంది విద్యార్థులు మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుకుంటున్నారట. వీళ్ళు కాకుండా మన దేశానికి చెందిన విద్యార్థులు ఉక్రెయిన్ లో సుమారు 18 వేల మంది ఉన్నత చదవులు చదువుతున్నారట.

ఇక తెలుగు విద్యార్ధు విషయానికి వస్తే దేశంలో ఎక్కడెక్కడో చదువుకుంటున్న వీరంతా ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు చేరుకున్నారట. కీవ్ లోని మనదేశ రాయబార కార్యాలయంలో తమ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఒకవేళ యుద్ధమే గనుక మొదలైతే వెంటనే ఆ దేశాన్ని వదిలి భారత్ చేరుకునేందుకు వీలుగా వాళ్ళంతా తమ వివరాలను ఎంబసీ కార్యాలయంలో నమోదు చేసుకుంటున్నారు. ఇప్పటికైతే తాత్కాలికంగా విద్యా సంస్ధలను ప్రభుత్వం మూసేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుండి సెమిస్టర్ మొదలవుతుందని విద్యార్థులకు సమాచారం అందినా ఆ అవకాశాలైతే అనుమానంగానే ఉన్నాయి