Begin typing your search above and press return to search.

మణిపూర్ లో ఇరుక్కుపోయిన తెలుగు విద్యార్థులు

By:  Tupaki Desk   |   7 May 2023 11:25 AM GMT
మణిపూర్ లో ఇరుక్కుపోయిన తెలుగు విద్యార్థులు
X
మణిపూర్లో తెలుగు విద్యార్థులు ఇరుక్కోవటం అంటే ఏదో పనిమీద వెళ్ళి ఇరుక్కుపోవటం కాదు. అక్కడ చదువుతున్న విద్యార్థులు తాజా పరిణామాల్లో బయటకు రాలేక ఇరుక్కుపోయినట్లు అర్దం. మణిపూర్లో హఠాత్తుగా చెలరేగిన అల్లర్ల కారణంగా లక్షలాది మంది జనాలు ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వేషన్ వివాదం రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 9 జిల్లాల్లో అల్లర్లు, దహనాలు తీవ్రస్ధాయిలో మంటలు మండిస్తున్నాయి. దాంతో కనిపిస్తే కాల్పుల ఆదేశాలను గవర్నర్ జారీచేశారు. మొత్తం రాష్ట్రమంతా మిలటరీ దిగేసింది.

అసలే ఉగ్రవాదులకు నిలయమైన ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ కూడా కీలకమైనదే. ఏచిన్న అల్లరి జరిగినా వెంటనే ఉగ్రవాదులు దూరిపోయి కంపు చేసేస్తారు. రెగ్యులర్ పోలీసు శాంతిభద్రతల రక్షణలో విఫలమయ్యారు. అందుకనే రాష్ట్రమంలో ఆర్టికల్ 355 విధించిన కేంద్రం మిలిట్రీని రంగంలోకి దింపేసింది. తొమ్మిది జిల్లాల్లో కర్ఫ్యూ అమలవుతోందంటేనే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్ధితుల్లో రాష్ట్రంలోని ఆఫీసులు, ప్రైవేటు ఎస్టాబ్లిష్మెంట్లు, షాపింగ్ మాల్స్ తో పాటు విద్యాసంస్ధలను కూడా మూసేశారు.

దాంతో మామూలు జనాలతో పాటు విద్యార్ధులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్ధులంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది బయటరాష్ట్రాల నుండి మణిపూర్ వెళ్ళి చదువుకుంటున్న వారే. బయట రాష్ట్రాల వాళ్ళల్లో తెలుగురాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు సుమారు వెయ్యిమంది మణిపూర్లోని వివిధ క్యాంపసుల్లో చదువుకుంటున్నారట. ఎక్కువమంది రాజధాని ఇంఫాల్ లోనే ఉన్నారట. నాలుగురోజులుగా గదులకు, హాస్టళ్ళకే పరిమితమైపోవటంతో తిండికి ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.

అల్లర్లు మొదలవ్వగానే ఎప్పుడేమవుతుందో ఏమో అనే భయంతో హాస్టళ్ళను, క్యాంటిన్లను మూసేయటంతో భోజనం కూడా దొరకటంలేదట. అలాగే బయట గదుల్లో ఉంటున్న విద్యార్ధులది కూడా సేమ్ ప్రాబ్లమే. అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించి ఢిల్లీలోని ఏపీ భవన్లో హెల్ప్ లైన్లను ఏర్పాటుచేసింది. సాయం అవసరమైన వారంతా 011-23384016, 011-23387098 నెంబర్లకు ఫోన్ చేయాలని ప్రకటించింది. తెలుగు విద్యార్ధులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు కేంద్రంతో పాటు మణిపూర్ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి కార్యాలయం, ఏపీ భవన్ ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారు. మణిపూర్లోని అల్లర్లకు ఇప్పటివరకు సుమారు 60 మంది చనిపోయారు.