తాజాగా ఒక సర్వే ఫలితం వెల్లడైంది. కోట్లాది మంది తెలుగోళ్లు సిగ్గుపడటమే కాదు.. డిజిటల్ యుగంలోనూ ఇంత దారుణమైన ర్యాంకులా? అని ఫీల్ కావాల్సిన దుస్థితి. తెలుగు రాష్ట్రాలకు డైనమిక్ ముఖ్యమంత్రులు ఉన్నప్పటికి అక్షరాస్యతలో దేశంలోనే దారుణమైన ర్యాంకులు తెలుగు రాష్ట్రాలకు రావటం ఆందోళన కలిగించేవిగా చెప్పక తప్పదు. హౌస్ హోల్డ్ సోషల్ కన్సంప్షన్.. ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే అంశంపై జాతీయ గణాంక సంస్థ జాతీయన నమూనా సర్వేను నిర్వహించారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏడేళ్ల వయసు దాటిన వారిలో అక్షరాస్యత ఎంత ఉందన్న ఆధారంగా ఈ సర్వే ఫలితాల్ని విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా అక్షరాస్యత రేటు 77.7 శాతంగా తేల్చారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత రేటు 73.5 శాతం ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 87.7 శాతంగా తేలింది. ఎప్పటిలానే అక్షరాస్యతలో కేరళ తొలి స్థానంలో నిలిచింది. ఢిల్లీ రాష్ట్రం రెండో స్థానంలో నిలవగా.. ఉత్తరాఖండ్ (87.6) మూడో స్థానంలో.. హిమాచల్ ప్రదేశ్ (86.6) నాలుగో స్థానంలో.. అసోం (85.9) ఐదో స్థానంలో నిలవటం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. అక్షరాస్యత జాబితాలో అట్టడుగు స్థానంలో ఆంధ్రప్రదేశ్ (66.4శాతం) నిలవగా.. ఈ జాబితాలో కింద నుంచి నాలుగో స్థానంలో తెలంగాణ రాష్ట్రం (72.8శాతం) నిలిచింది. దారుణమైన విషయం ఏమంటే.. రాజస్థాన్.. బిహార్.. ఉత్తరప్రదేశ్ కంటే కూడా ఏపీ వెనుకబడి ఉండటం. ఈ రోజుల్లో కూడా అక్షరాస్యత విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఇంత దారుణంగా వెనుకబడిపోవటమా? అన్న సందేహం రాకమానదు. దేశ వ్యాప్తంగా అక్షరాస్యతలో పురుషులు ముందున్నారు. దేశంలోని 84.7 శాతం మంది పురుషులు అక్షరాస్యత సాధించగా.. మహిళల్లో ఇది కాస్తా 70.3 శాతానికే పరిమితం కావటం గమనార్హం. సర్వేలో తొలిస్థానంలో నిలిచిన కేరళలో అత్యధికంగా పురుషుల్లో 97.4 శాతం మంది.. స్త్రీలలో 95.2 శాతం మంది అక్షరాస్యులుగా తేల్చారు. ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.