Begin typing your search above and press return to search.

గోలెందుకని.. తెలుగు రాష్ట్రాల శకటాలు రిజెక్ట్?

By:  Tupaki Desk   |   12 Dec 2015 2:09 PM GMT
గోలెందుకని.. తెలుగు రాష్ట్రాల శకటాలు రిజెక్ట్?
X
జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాల్ని ప్రదర్శించటం తెలిసిందే. ఈ ఉత్సవంలో తమ రాష్ట్రాల శకటాల్ని ప్రదర్శించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కసరత్తు చేస్తుంటాయి. విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల శకటాలు కనువిందు చేస్తాయని భావించారు. అందుకు భిన్నంగా రెండు తెలుగు రాష్ట్రాల శకటాల్ని రిజెక్ట్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ రిజెక్ట్ వెనుక ఉన్నకారణం ఆసక్తికరంగా మారింది.

రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించే శకటాలను కేంద్ర రక్షణ శాఖలోని 18 మందితో కూడిన నిపుణుల కమిటీ ఎంపిక చేస్తుంది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలు రూపొందించిన రెండు శకటాల్ని కమిటీ రిజెక్ట్ చేసింది. తెలంగాణ సర్కారు సమక్క.. సారలమ్మ డిజైన్ తో శకటాన్ని రూపొందిస్తే.. ఏపీ సర్కారు కొత్త రాజధాని అమరావతి విశిష్టతను తెలిపేలా శకటాన్ని డిజైన్ చేసింది.

అయితే.. ఈ రెండు శకటాల్ని ఎంపిక చేయకపోవటం వెనుక పెద్ద కథే నడిచిందని చెబుతున్నారు. వాస్తవానికి తెలంగాణ సర్కారు రూపొందించిన శకటం చాలాబాగుందన్న కితాబు లభించిందని చెబుతున్నారు. అయితే.. తెలంగాణ శకటంతో పోలిస్తే.. ఏపీ శకటం అంత బాగోలేదన్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీని రిజెక్ట్ చేసి.. తెలంగాణను ఓకే చేస్తే లేనిపోని లొల్లి అవుతుందన్న ఉద్దేశంతో రెండింటిని ఎంపిక చేయలేదని చెబుతున్నారు.

దీనికి కారణం లేకపోలేదు. గతేడాది ఏపీ శకటాన్ని ఓకే చేసి తెలంగాణ శకటాన్ని రిజెక్ట్ చేశారు. దీంతో.. రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో మల్లి తెలంగాణ శకటాన్ని ఓకే చేశారు. ఈసారి తెలంగాణ శకటాన్ని ఓకే చేసి ఏపీని రిజెక్ట్ చేస్తే.. అదో వివాదంగా మారుతుందన్న సందేహంతో.. రెండింటిని ఎంపిక నుంచి తప్పించాలని భావించినట్లు చెబుతున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల శకటాలు రిజెక్ట్ కావటంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్రుగా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్తితి కొనసాగితే.. రిపబ్లిక్ డే నాడు తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం లేకుండానే శకట ప్రదర్శన సాగే అవకాశం ఉంది. దేశాభివృద్ధిలో కీలకభూమిక పోషించే తెలుగోడి శకటం లేకుండా రిపబ్లిక్ డే పెరేడ్ జరగటమా..?