Begin typing your search above and press return to search.

ఏడేళ్లలో అమెరికా నగరాల్లో సగం మనోళ్లే..

By:  Tupaki Desk   |   8 Oct 2018 8:21 AM GMT
ఏడేళ్లలో అమెరికా నగరాల్లో సగం మనోళ్లే..
X
అమెరికాలో తెలుగు వారి ఖ్యాతి ఇనుమడిస్తోంది. అమెరికా అంటే ఇంగ్లీష్ భాష. కానీ మన తెలుగు ఇప్పుడు ఉధృతంగా విస్తరిస్తోంది. ఇందుకు మన తెలుగోళ్లే కారణమట.. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది యువత అమెరికాకు వెళ్లి సెటిల్ అయిపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందట..

2015లో అమెరికా కాన్సులేట్ నుంచి అత్యధిక వీసాలు హైదరాబాద్ నుంచే ఇచ్చారని తాజా నివేదిక నిగ్గు తేల్చింది. భారత్ లోని మరే ప్రాంతం నుంచి ఇన్ని వీసాల జారీ కాలేదట.. హైదరాబాద్ నుంచే ఎక్కువమంది యువత అమెరికాకు వెళ్తున్నారు. 2010 నుంచి 2017 మధ్య తెలుగు మాట్లాడే వారి సంఖ్య అమెరికాలో అనూహ్యంగా పెరిగినట్టు ఓ నివేదిక వెల్లడించింది.

ఈ నివేదిక మరో విషయాన్ని తేటతెల్లం చేసింది. అమెరికాలో నివసిస్తున్న దాదాపు సగం మంది తమ తమ ఇళ్లలో ఇంగ్లీష్ మాట్లాడడం లేదు. ప్రతీ ఐదుగరిలో ఒకరు తమ ఇళ్లలో ఇంగ్లీష్ కాకుండా విదేశీ భాషనే మాట్లాడుతున్నారని తేల్చారు.

అమెరికాలో తెలుగు తర్వాత అరబిక్ - హిందీ - ఉర్దూ - గుజరాతీ భాషలు ఎక్కువగా మాట్లాడుతారు. తెలుగు భాష మాట్లాడే వారు 89శాతం పెరగగా.. అరబిక్ మాట్లాడేవారు 42శాతం - హిందీ మాట్లాడే వారు 42శాతం - ఉర్దూ మాట్లాడే వారు 30శాతం - చైనీస్ మాట్లాడేవారు 23శాతం - గుజరాతీ మాట్లాడే వారు 22శాతం పెరిగారు.

అమెరికా సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ (సీఐఎస్) సర్వే ప్రకారం 2010 నుంచి 2017 మధ్య అమెరికాలో తెలుగు మాట్లాడే వారు 89శాతం పెరిగారని వరల్డ్ ఎకనామిక్ ఫోరం కథనం ప్రచురించింది. ఇక్కడ దాదాపు 4 లక్షల మంది తెలుగు మాట్లాడే వారున్నారు. బెంగాళీ మాట్లాడే వారు 3.50లక్షలు - తమిళం మాట్లాడేవారు 2.80లక్షలు ఉన్నారు. భారత్ లో హిందీ మాట్లాడే రాష్ట్రాలు - జనాభా ఎక్కువ. కానీ అమెరికాలో మాత్రం తెలుగు మాట్లాడే వారి శాతమే ఎక్కువగా పెరగడం విశేషం.