Begin typing your search above and press return to search.

తెలుగోళ్ల గోడు పట్టని చంద్రుళ్లు..?

By:  Tupaki Desk   |   27 July 2015 4:59 AM GMT
తెలుగోళ్ల గోడు పట్టని చంద్రుళ్లు..?
X
రాష్ట్ర విభజనకు ముందు.. తర్వాత.. ఎక్కడైనా సరే.. తెలుగు వారికి ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే.. మిగిలిన వారి కంటే మహా హుషారుగా రియాక్ట్ అయ్యేవారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన స్పందించిన కాసేపటికే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించటం.. ఇరు రాష్ట్రాల వారు పోటాపోటీగా ఏర్పాట్లు చేసి.. ఆపదలో ఆదుకున్న వారికి సాయం అందించేందుకు విపరీతంగా కష్టపడేవారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల నేతలు ఘర్షణ పడిన ఉదంతాలు ఉన్నాయి.

ఆ రేంజ్ లో తెలుగువారి కోసం తపిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చే రెండు రాష్ట్రాల నేతలు.. తాజాగా అమర్ నాథ్ యాత్రలో చిక్కుకుపోయిన తెలంగాణ.. ఏపీ ప్రజానీకాన్ని ఇద్దరు చంద్రుళ్లు లైట్ తీసుకోవటం గమనార్హం.

తెలంగాణ లోని ఖమ్మం జిల్లా.. ఏపీకి చెందిన తూర్పుగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెనికి చెందిన యాత్రికులు ఇప్పుడు జమ్మూకాశ్మీర్ లో చిక్కుకుపోయారు. అమర్ నాథ్ యాత్రలో భాగంగా ప్రయాణం అయిన వారు.. జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ దాటి వెళుతున్న క్రమంలో బాల్ థార్ వద్ద కొండ చరియ విరిగి పడటంతో వీరి బస్సు నిలిచిపోయింది.

దాదాపు వందకు పైగా తెలుగువారు ఇప్పుడు జమ్మూకాశ్మీర్ లో చిక్కుకుపోయారు. వారంతా సాయం కోసం ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదని వాపోతున్నారు. గోదావరి పుష్కరాల్లో బిజీగా ఉన్నారో.. లేక.. టీవీలో పెద్దగా ఫోకస్ కాని ఈ ఇష్యూ మీద రియాక్ట్ అయితే.. పెద్దగా ప్రయోజనం ఉండదని ఊరుకున్నారో కానీ.. సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్న తెలుగోళ్ల గురించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టకపోవటం గమనార్హం. కొన్ని సందర్భాల్లో సాయం చేసేందుకు కొట్టుకునేలా వ్యవహరించే వారు.. ఇప్పుడు వందకు పైగా తెలుగువారు.. సదూర ప్రాంతంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోతే.. వారి గురించి ఇద్దరు చంద్రుళ్లకు ఎందుకు పట్టటం లేదు..?