Begin typing your search above and press return to search.

లోకేశ్.. బాబులకు ఉన్న తెలివి తెలుగు తమ్ముళ్లకు లేదా?

By:  Tupaki Desk   |   22 Oct 2022 4:15 AM GMT
లోకేశ్.. బాబులకు ఉన్న తెలివి తెలుగు తమ్ముళ్లకు లేదా?
X
లక్ష్యం పక్షి కనుగుడ్డు అయినప్పడు.. చూపంతా దాని మీదనే ఉండాలే తప్పించి.. మొత్తం పక్షి మీదనే ఉంటే ఏమవుతుంది? లక్ష్యాన్ని చేధించడం ముఖ్యమైనప్పుడు ఫోకస్ అంతా దాని వైపే ఉండాలే తప్పించి పక్క చూపు చూడకూడదు. ఇంత చిన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు మిస్ అవుతున్నారా? అంటే.. అవునన్న మాట వినిపిస్తోంది. అవసరం లేని ఇగోలతో అసలు లక్ష్యాన్ని వదిలేసి.. కొసరు అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న తెలుగు తమ్ముళ్ల తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలోని జగన్ పాలనపై నిత్యం ఆగ్రహావేశాల్ని ప్రదర్శించే తెలుగు తమ్ముళ్లు.. ఇప్పుడు తమ అధినేతపైనా.. ఆయన రాజకీయ వారసుడిపైనా గుర్రుగా ఉన్న వైనం హాట్ టాపిక్ గా మారింది.2024 ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కొనేందుకు తమ అధినేతలు సొంతంగా సిద్ధం కావటం కంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి నడిచే విషయంలో అధినాయకత్వానికి.. మిగిలిన వారిలో అత్యధికుల మధ్య ఆలోచనా తీరులో తేడా ఉండటం ఇప్పుడు కొత్త చర్చకు తావిస్తోంది. ఈ సందర్భంగా వారు వినిపిస్తున్న వాదనలు.. అసలు విషయాన్ని వదిలేసి.. కొసరు అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న వైనం కొత్త ఇబ్బందులకు తెర తీస్తుందన్న మాట వినిపిస్తోంది.

2024 ఎన్నికల్లో జనసేనతో కలిసి పొత్తు పెట్టుకునే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయన రాజకీయ వారసుడు లోకేశ్ లు నిశ్చిత అభిప్రాయంతో ఉన్నారు. ఈ కారణంతోనే విశాఖలో జనసేనానిని ఎదురైన చేదు అనుభవంపై మిగిలిన వారి కంటే ముందుగా రియాక్టు అయ్యింది నారా లోకేశ్. విశాఖ పోలీసుల తీరును తప్పు పడుతూ.. పవన్ చేస్తున్న పోరాటానికి సంఘీభావం వ్యక్తం చేయటమే కాదు.. ప్రభుత్వ తీరును తప్పు పట్టారు లోకేశ్.

సోషల్ మీడియాలో లోకేశ్ రియాక్టు అయిన కొంతసేపటికే చంద్రబాబు సైతం విశాఖలో పవన్ కు పోలీసుల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని ప్రస్తావిస్తూ.. ఆయనకు దన్నుగా మాట్లాడారు. ఇంతవరకు తెలుగు తమ్ముళ్లకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ.. ఎప్పుడైతే చంద్రబాబు వెళ్లి పవన్ ను కలిశారో.. ఆ ఎపిసోడ్ మీద తెలుగు తమ్ముళ్లు గుర్రు మీద ఉన్నారన్న మాట బలంగా వినిపిస్తోంది.

జనసేనతో కలిసి పోటీ చేయటం కంటే.. ఒంటరిగా పోటీ చేయటంపైనే తెలుగు తమ్ముళ్లు ఆలోచిస్తుంటే.. వీలైనంతగా విపక్షాల్ని కలుపుకుపోవాలన్నట్లుగా చంద్రబాబుకు..ఆయన కుమారుడికి ఉంది. రాబోయే ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా మారింది చంద్రబాబుకే కానీ తెలుగు తమ్ముుళ్లకు కాదు. తప్పు ఇసుమంత కూడా జరగకూడదన్న పట్టుదలతో టీడీపీ అధినాయకత్వం ఉంది. అందుకే.. జగన్ ఓటమి అనే పక్షి కనుగుడ్డు లాంటి లక్ష్యాన్ని మాత్రమే చూస్తున్నారు చంద్రబాబు.. లోకేశ్ లు. అందుకు తగ్గట్లే.. తమ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇందుకు భిన్నంగా తెలుగు తమ్ముళ్లు మాత్రం అవనసరమైన ఇగోలకు పోయి.. పవన్ ను కలుపుకుపోయే పెద్ద మనసును ప్రదర్శించకుండా.. కొత్త సమస్యలు తెర మీదకు వచ్చేలా రియాక్టు అవుతున్నారు. తమ్ముళ్ల తీరుతో అధినాయకత్వం ఆందోళనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదంతా చేసినోళ్లు.. చంద్రబాబు.. లోకేశ్ లకు ఉన్న తెలివి.. ముందుచూపు తెలుగు తమ్ముళ్లలో లేకపోవటంపై ఆందోళన చెందుతున్నట్లుగా చెప్పక తప్పదు. అధికారమే అవసరం తప్పించి.. అనవసరమైన ఇగోలతో ఇసుమంతైనా ప్రయోజనం ఉండదన్న వాస్తవాన్ని తెలుగు తమ్ముళ్లు ఎప్పటికి గుర్తిస్తారో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.