Begin typing your search above and press return to search.

త‌మిళ ఎన్నిక‌ల్లో తెలుగు తంబీల హ‌వా.. ముఖ్య‌మంత్రులు అవుతారా?

By:  Tupaki Desk   |   19 March 2021 2:30 PM GMT
త‌మిళ ఎన్నిక‌ల్లో తెలుగు తంబీల హ‌వా.. ముఖ్య‌మంత్రులు అవుతారా?
X
త‌మిళ‌నాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల కోలాహ‌లం ఓ రేంజ్ లో కొన‌సాగుతోంది. ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేందుకు ప్ర‌ధాన పార్టీలు నోటికి వ‌చ్చిందే హామీ అన్న‌ట్టుగా వాగ్ధానాలు ఇచ్చేస్తున్నారు. ఆల్ ఫ్రీ త‌ర‌హాలో.. ఓట‌ర్లు అడిగిందీ, అడ‌గ‌నిదీ అన్నీ ప్ర‌క‌టించేస్తున్నారు. చివ‌ర‌కు నాస్తికం పునాదుల మీద పురుడుపోసుకున్న డీఎంకే.. ఆధ్యాత్మిక అంశాల‌ను కూడా మేనిఫెస్టోల్లో ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. త‌మిళ పార్టీల‌కు ప్ర‌తీ ఎన్నిక‌ల్లో కీల‌కంగా క‌నిపించే అంశాల్లో ఒక‌టి తెలుగు వాళ్లు. అక్క‌డ సెటిల్ అయిన తెలుగు వాళ్ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు అన్ని పార్టీలూ తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తుంటాయి. దీనికి కార‌ణం వారి సంఖ్యే! దాదాపు 50 ల‌క్ష‌ల మందికి పైచిలుకు తెలుగువాళ్లు త‌మిళ‌నాట ఉన్నారు. ప్ర‌త్యేకించి కొన్ని నియోజ‌క‌వర్గాల్లో మెజారిటీ ప్ర‌భావం కూడా వీరిదే. అందుకే.. తెలుగు జ‌నాలపై ప్ర‌త్యేక దృష్టి సారిస్తుంటాయి త‌మిళ పార్టీలు.

జ‌య‌ల‌లిత‌, క‌రుణానిధి లేకుండా సాగుతున్న తొలి ఎన్నిక‌లు కావ‌డంతో.. ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా వ‌దులుకునేందుకు అక్క‌డి పార్టీలు సిద్ధంగా లేవు. అందుకే.. తెలుగువారికి గ‌ణ‌నీయంగానే సీట్లు కేటాయించాయి. ఈ ఎన్నిక‌ల్లో దాదాపు 20 మందికి పైగా తెలుగు అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. డీఎంకే పార్టీ నుంచి తిరువ‌ణ్నామ‌లై, అన్నాన‌గ‌ర్‌, హార్బ‌ర్‌, సైదాపేట‌, హోసురు నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగువారు పోటీ చేస్తున్నారు. అన్నాడీఎంకే నుంచి మ‌రింత మంది పోటీలో ఉన్నారు. టీ.న‌గ‌ర్‌, కొళ‌త్తూరు, ఆర్కేన‌గ‌ర్‌, విల్లివాక్కం వంటి చోట్ల తెలుగు జ‌నాలు అదృష్టం ప‌రీక్షించుకుంటున్నారు.

కాగా.. మ‌ద్రాసులో ఏపీ క‌లిసి ఉన్న రోజుల్లోనే తెలుగువాళ్లు త‌మిళ‌నాడు మొత్తం విస్త‌రించారు. ఆ త‌ర్వాత ఆంధ్ర విడిపోయిన త‌ర్వాత కొంద‌రు తెలుగు ప్రాంతానికి వ‌చ్చేయ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం అక్క‌డే ఉండిపోయారు. అలాంటి వారిలో చాలా మంది త‌మిళ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతున్నారు. చెన్నై మొద‌టి మేయ‌ర్ త్యాగ‌రాజ చెట్టి కూడా తెలుగువారే. ఆ త‌ర్వాత ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన పెరియార్‌, క‌రుణానిధితోపాటు జ‌య‌ల‌లిత కూడా తెలుగు ఆన‌వాళ్లు ఉన్న‌వారే. ఇప్పుడు ఆ మ‌హామ‌హులు ఇద్ద‌రూ లేరు. అదేస‌మ‌యంలో త‌మిళ రాజ‌కీయాల్లో తెలుగువారి పాత్ర గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. మ‌రి, త‌మిళ‌నాట తెలుగు వారు ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం ఉందా? అనే చ‌ర్చకూడా సాగుతోంది. దీనికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంది.