Begin typing your search above and press return to search.

తమిళనాడులో 22మంది తెలుగోళ్ల విజయం

By:  Tupaki Desk   |   21 May 2016 6:15 AM GMT
తమిళనాడులో 22మంది తెలుగోళ్ల విజయం
X
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు వారు సత్తా చాటారు. లెక్క తీస్తే మొత్తం 22 మంది తెలుగువారు విజయం సాధించారని తేలింది. అయితే, తాము తెలుగు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లమని చెప్పుకునేందుకు వీరిలో చాలామంది ఇష్టపడడం లేదు. అందుకు వారికున్న రాజకీయ కారణాలు వారివి.

తాజా ఎన్నికల్లో డీఎంకే 20 మంది తెలుగువారికి - అన్నాడీఎంకే 13 మందికి - కాంగ్రెస్ ఇద్దరికి - బీజేపీ ఐదుగురు తెలుగువాళ్లకు టికెట్లు ఇవ్వగా - వారిలో 22 మంది గెలిచారు. వీరిలో తాము తెలుగువాళ్లమని చెప్పేవారు పట్టుమని పది మంది కూడా లేరు. చెన్నై నగర మాజీ మేయర్ - చిత్తూరు జిల్లా కుటుంబానికి చెందిన వ్యక్తి సుబ్రహ్మణియన్ చెన్నై పరిధిలోని సైదాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీఎంకే తరఫున పోటీ పడి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కూడా తెలుగు కుటుంబానికి చెందిన వారే. గెలిచినవారిలో నాయుడు వంటి పేర్లున్నవారు ఉన్నారు. తెలుగు మూలాలు - తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో బంధువులు ఉన్న నేతలు గెలుపు సాధించారు. వారి విజయం పట్ల తెలుగు జిల్లాల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది.

మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. తీవ్ర నిరాశలో ఉన్న ఆ పార్టీ అధినేత కరుణానిధి అన్నాడీఎంకేకు ఎన్నికల సంఘం (ఈసీ) లొంగిపోయిందని ఆరోపిస్తున్నారు. ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ రూ.570 కోట్ల విషయమై ఈసీ ఎటువంటి సమాధానం చెప్పలేదన్నారు. ఈ సందర్భంగా అవరకురిచ్చి - తంజావూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు వాయిదా వేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ - పీఎంకే పార్టీల కారణంగానే ఈ నియోజకవర్గాల్లో ఎన్నికలు వాయిదాపడ్డాయన్నారు. మరోసారి వాయిదా వేయాలని చూస్తే ఆందోళనకు దిగుతామని కరుణానిధి హెచ్చరిస్తున్నారు.