Begin typing your search above and press return to search.

తెలుగోళ్ల దెబ్బ బీజేపీకి మామూలుగా త‌గ‌ల్లేదా?

By:  Tupaki Desk   |   16 May 2018 4:20 AM GMT
తెలుగోళ్ల దెబ్బ బీజేపీకి మామూలుగా త‌గ‌ల్లేదా?
X
క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో తెలుగోళ్ల ప్ర‌భావం ఎంత‌? ప్ర‌త్యేక హోదా విష‌యంలో మోడీ స‌ర్కారు చేసిన అన్యాయంపై యావ‌త్ తెలుగోళ్లు మోడీ అండ్ కో ప‌ట్ల ఆగ్ర‌హంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. విభ‌జ‌న‌తో ఏపీకి జ‌రిగిన అన్యాయాన్ని హోదా ఎంతోకొంత పూడుస్తుంద‌నుకుంటే.. అదేమీ చేయ‌ని మోడీపై తెలుగువారంతా ఏక‌మ‌య్యార‌ని చెప్పాలి. చివ‌ర‌కు తెలంగాణ వాసులు సైతం ఏపీకి హోదా ఇవ్వ‌టం స‌బ‌బు అని వ్యాఖ్యానిస్తున్న ప‌రిస్థితి.

తెలుగోళ్ల ఆగ్ర‌హం మోడీ అండ్ కోకు భారీ మూల్య‌మే చెల్లించాల్సి వ‌చ్చింద‌న్న మాట‌ను ప‌లువురు విశ్లేషిస్తున్నారు. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నికల ఫ‌లితాల్లో బీజేపీ త్రిశుంక స్వ‌ర్గంలో నిల‌వ‌టానికి కార‌ణం క‌ర్ణాట‌క‌లోని తెలుగు ఓట‌ర్లుగా చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య‌మంత్రులు క‌ర్ణాట‌క‌లో తెలుగోళ్ల‌ను బీజేపీకి ఓటు వేయొద్ద‌ని చెప్పారు. హోదా విష‌యంలో ఆంధ్రోళ్ల‌కు జ‌రిగిన అన్యాయానికి కార‌ణ‌మైన మోడీ ప‌రివారానికి షాకివ్వాల‌న్న సందేశం పెద్ద ఎత్తున ప్ర‌చారంగా మారింది.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు క‌ర్ణాట‌క‌కు వెళ్లి ప్ర‌చారం చేయ‌లేదు కానీ.. ఓపెన్ గానే బీజేపీకి ఓటు వేయొద్ద‌న్న విష‌యాన్ని చెప్పేశారు. బీజేపీకి వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని ఇచ్చిన పిలుపు వ‌ర్క్ వుట్ అయ్యింద‌ని చెబుతున్నారు. తెలుగు ఓట‌ర్లు భారీగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీకి ద‌క్కిన సీట్లే ఇందుకు నిద‌ర్శ‌నంగా చూపిస్తున్నారు.

తెలుగువారి ఎఫెక్ట్ తో బ‌ల‌మైన బీజేపీ నేత‌లు ప‌లువురు ప‌రాజ‌యం పాల‌య్యారంటూ ఉదాహ‌ర‌ణ‌లు కూడా చెబుతున్నారు.

బ‌ళ్లారి జిల్లాలోని కంప్లిలో బీజేపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన సురేశ్ బాబు సునాయంగా గెలిచే అభ్య‌ర్థి. కానీ.. తెలుగోళ్ల కార‌ణంగా ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు. కేవ‌లం ఆయ‌న బీజేపీ నుంచి బ‌రిలోకి దిగ‌టంతోనే ఓడిపోవాల్సి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. తెలుగువారు భారీగా ఉండే బాగేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగిన సినీ న‌టుడు సాయికుమార్ ప‌రిస్థితి మ‌రింత దారుణం. ఆయ‌న‌కు డిపాజిట్ కూడా ద‌క్క‌లేదు. ఇక్క‌డ సాయికుమార్ మీద వ్య‌తిరేక‌త కంటే కూడా బీజేపీ మీద ఉన్న తెలుగు ఓట‌ర్ల‌కు ఉన్న మండిపాటే కార‌ణం.

క‌ర్ణాట‌క‌లో తెలుగు ఓట‌ర్లు అధికంగా ఉండే రాయ‌చూరు.. బ‌ళ్లారి.. చిక్ బ‌ళ్లాపూర్.. కోలార్ జిల్లాల్లోతెలుగోళ్ల సంఖ్యాబ‌లం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు 46 వ‌ర‌కూ ఉన్నాయ‌ని లెక్క తేల్చారు. వీటిల్లో కాంగ్రెస్ 32 చోట్ల విజ‌యం సాధిస్తే.. 9 స్థానాల్లో జేడీఎస్ జెండా ఎగుర‌వేసింది. కేవ‌లం 5 స్థానాల్లో మాత్ర‌మే బీజేపీ విజ‌యం సాధించింది.

తెలుగువారి వ్య‌తిరేక‌త కానీ లేని ప‌క్షంలో బీజేపీ సునాయాసంగా అధికారాన్ని చేప‌ట్టేద‌ని చెబుతున్నారు. ఒక‌వేళ ఆంధ్రోళ్ల‌తో బీజేపీకి పంచాయితీ లేని ప‌క్షంలో త‌క్కువ‌లో త‌క్కువ 15-20 స్థానాల్లో బీజేపీ విజ‌యం సాధించి ఉండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

తెలుగోళ్ల‌తో పెట్టుకున్న ఏ పార్టీ ఇప్ప‌టివ‌ర‌కూ బాగు ప‌డింది లేద‌ని.. వారి ఉసురు ఊరికే పోద‌న్న మాట ఇప్పుడు బ‌లంగా వినిపిస్తోంది. ఇప్ప‌టికైనా తెలుగోళ్ల‌తో బీజేపీ సున్నం పెట్టుకోవ‌టం ఆపేస్తే మంచిద‌ని.. మ‌రింత రెచ్చ‌గొడితే అది బీజేపీకే న‌ష్ట‌మంటున్నారు. తిరుగులేని బ‌లంతో చెల‌రేగిపోతున్న బీజేపీకి.. తెలుగోడి అసంతృప్తితో ప‌రాజ‌యం రుచి చూడ‌క త‌ప్ప‌ద‌ని.. అందుకు శాంపిల్‌.. క‌ర్ణాట‌క ఫ‌లితాల‌న్న అభిప్రాయం కొంద‌రి నోట వినిపిస్తోంది.