Begin typing your search above and press return to search.

తెలుగు జర్నలిజం చచ్చిపోయిందా..?

By:  Tupaki Desk   |   21 Oct 2019 7:38 AM GMT
తెలుగు జర్నలిజం చచ్చిపోయిందా..?
X
పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రిక..’ అంటూ కొన్ని దశాబ్దాల కిందటే మహాకవి శ్రీశ్రీ నాటి ఒక ప్రముఖ పత్రికపై ధ్వజమెత్తారు. దశాబ్దాల నాటి కిందటే మీడియా గురించి ఒక మహాకవి అలా మాట్లాడారు. గడిచిన దశాబ్దాల్లో మీడియా పరిస్థితి మరింత దారుణంగా తయారుకావడం - రోజు రోజుకూ పతనావస్థకు చేరుకోవడమే తప్ప ఎక్కడా విలువలు బతికి లేవు.

గడిచిన నాలుగు దశాబ్దాల్లో మీడియా పూర్తిగా రాజకీయంగా మారింది. ఇప్పటికీ అంతర్జాతీయంగా కొన్ని మీడియా వర్గాలు రాజకీయాల కన్నా ప్రజాసంబంధ విషయాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాయి. అయితే ఇండియాలో - అందునా తెలుగునాట అలాంటి పరిస్థితి లేదు. కొన్ని దేశాల్లోని పత్రికలు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూడా మొదటి పేజీలో ప్రజా సమస్యలకు సంబంధించిన వార్తలే ఇస్తాయి. అయితే మన దగ్గర ఊర్లో పంచాయతీ ఎన్నిక గురించి కూడా బోలెడన్ని కథనాలు ఇస్తాయి మీడియా వర్గాలు.

అలా రాజకీయమే ప్రాధాన్యతగా మారడంతో.. మీడియా ఒక రాజకీయ పెట్టుబడి దారీ వ్యవస్థగా మారింది. ప్రతి పత్రికా ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ మనుగడసాగిస్తూ వచ్చింది. ఒక టీవీ చానళ్లు వచ్చిన తర్వాతి సంగతి చెప్పనక్కర్లేదు. రాజకీయ పార్టీల ఆఫీసుల్లోనే ప్రసవించబడుతూ వస్తున్నాయి టీవీ చానళ్లు. అనేక టీవీ చానళ్లలో రాజకీయ పార్టీల ప్రత్యక్ష పెట్టుబడులతో మొదలైనవి. చానళ్ల నుంచి వచ్చే డబ్బుతో నడుస్తున్నవి.

ఇందులో దాపకరికాలు లేవు. ఒక అరగంట సేపు ఒక చానల్ ను చూశామంటే.. ఆ చానల్ ఏ రాజకీయపార్టీకి కొమ్ముకాస్తూ ఉందో అర్థం చేసుకోవచ్చు. మీడియా కూడా ఫక్తు వ్యాపారంగా మారింది. అది ఎంటర్ టైన్ మెంట్ ను అందించి, యాడ్స్ తెచ్చుకుని మనుగడ సాగించాలి. అయితే అక్కడకూ యాజమాన్యాల ఆశ తీరదు. అందుకే రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్త ఉంటాయనేది బహిరంగ సత్యం.

ప్రతి విషయంలోనూ ఒక రేటు మాట్లాడుకుని సాగుతూ ఉన్నాయి. ఇక రాజకీయ నేతలు కూడా తమ ప్రచారార్భాటాల కోసం మీడియాను ఒక వస్తువుగా మార్చారు.

ఇక ఇలాంటి సమయంలో కూడా కొందరు రాజకీయ నేతలు నీతులు మాత్రం వల్లెవేస్తూ ఉంటారు. తమకు మీడియా అండలేదని - సొంతంగా పత్రిక లేని - సొంతంగా టీవీ చానల్ లేదని.. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నవ్విపోదరుగా మాకేంటి సిగ్గు అన్నట్టుగా ఉంది వారి తీరు.

దశాబ్దాలు మీడియా సహకారం లేదని - మీడియా వర్గాలు జాకీ వేయనిది సదరు రాజకీయ నేతల కెరీరే లేదు. అయినా వారు తమకు సొంతమీడియా లేదని ప్రజలు చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నాలను చూసి జనాలు నవ్వుకుంటారనే కనీస ఇంగితం కూడా ఆ నేతలకు లేకపోవడమే గమనార్హం.

తాము ఏం చెబితే అదే ప్రజలు నమ్ముతారు అనే నమ్మకం కావొచ్చు వారిది. అలాంటి నమ్మకం వారికి కలగడానికి కారణం కూడా మీడియానే అని వేరే చెప్పనక్కర్లేదు. రాజకీయ పార్టీల రంగుల్లేని టీవీ చానళ్లు - వార్తా పత్రికలు లేని రోజులు ఇవి. ఇక జర్నలిస్టులు కూడా కొంతమంది వ్యక్తిగతం తాము ఎలాంటి విలువలూ పాటించనక్కర్లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న వైనం కూడా క్షేత్ర స్థాయిలో అగుపిస్తూ ఉంటుంది. బ్లాక్ మెయిలింగ్, ఎల్లో జర్నలిజం బోలెడంత కనిపిస్తుంది క్షేత్ర స్థాయిలో. జర్నలిస్టులు కూడా అలా అయిన కాడికి సంపాదించుకోవాలనే ధోరణిలో కొంతమంది సాగుతూ ఉంటారు. యాజమాన్యాలు అలా - కొంతమంది జర్నలిస్టులు ఇలా.. ఇలాంటి సమయంలో తెలుగు జర్నలిజం పరిస్థితి గురించి పచ్చిగా చెప్పడానికి శ్రీశ్రీ లాంటి మహాకవి ఉంటే..మరెంత తీవ్రమైన పదజాలం ఉపయోగిస్తారో!