Begin typing your search above and press return to search.

ఈ తెలుగు మీడియాకు ఏమైంది..?

By:  Tupaki Desk   |   17 Oct 2016 11:30 AM GMT
ఈ తెలుగు మీడియాకు ఏమైంది..?
X
మిగిలిన సంగతులన్ని పక్కన పెట్టేద్దాం. సూటిగా ఒకే ఒక్క ప్రశ్న. మీడియా బాధ్యత ఏంటి? డబ్బులిస్తే తప్ప తమ సేవల్ని అందించని మీడియా అసలేం చేయాలి? ఏం చేయకూడదన్న ప్రశ్నలు వేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది. ఒక సబ్బు కావొచ్చు.. ఒక కూల్ డ్రింక్ కావొచ్చు. కొనుక్కున్న వస్తువు బాగోకపోతే.. అమ్మిన షాపు వాడి దగ్గర నుంచి.. దాన్ని తయారు చేసిన కంపెనీ వరకూ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మరి.. ఐదు రూపాయిలు ఇస్తే కానీ.. చేతిలోకి రాని తెలుగు దినపత్రికకు సంబంధించి అసంతృప్తి రేగితే అందుకు సంతృప్తి కలిగించేది ఎవరు? న్యూస్ ఛానళ్లు ఫ్రీ గా వస్తున్నాయని అనుకుంటాం కానీ.. ఆ ఛానల్ చూసే క్రమంలో వారు వేసే యాడ్స్ ను చూడటానికి విలువైన సమయాన్ని వెచ్చిస్తున్న విషయాన్ని మర్చిపోకూడదు.

అంటే.. పేపర్ కానీ.. టీవీ కానీ చదవటం.. చూడటం లాంటివి చేస్తున్న ప్రతిఒక్కరూ తమ విలువైన సమయం కానీ.. తమ జేబులో నుంచి డబ్బులు కానీ ఖర్చు పెడుతున్నట్లే. మరి.. అలాంటి వేళ అందించాల్సిన సమాచారం సరిగా అందించకపోతే బాధ్యత వహించేవారు ఎవరు? ఇవ్వాల్సిన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వకుండా ఉండటాన్ని సేవా లోపం కింద పరిగణించొచ్చా? పరిమితమైన స్థలం పేరుతో.. వార్తల ప్రాధాన్యాన్ని ఎవరికి వారు తమకు తోచినట్లుగా వార్తలు ఇస్తున్న వైనాన్ని ప్రశ్నించే అవకాశం లేదా? అన్నది ప్రశ్న.

ఉన్నట్లుండి ఎందుకింత ఆగ్రహం అని ప్రశ్నించొచ్చు. ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే మరి.. ఇలానే అనిపించే పరిస్థితి. ఓపక్క సోషల్ మీడియాలో సమాచారం కుప్పలు తెప్పులుగా వస్తున్న వేళ.. మీడియాలో మాత్రం అలాంటి అంశాలకు సంబంధించిన వార్తల్ని ఇవ్వకపోవటం చూసినప్పుడు ఇలాంటి సందేహాలే కలిగే పరిస్థితి. ఎక్కడి వరకో ఎందుకు.. తెలంగాణ రాష్ట్రం విషయానికే వద్దాం. దసరా పండగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 జిల్లాల స్థానే 31 జిల్లాలుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వార్తలు భారీగానే ఇచ్చారు. ఇంతవరకూ ఎలాంటి అభ్యంతరం లేదు.

కానీ.. ఈ జిల్లాల్ని ఏర్పాటు చేసే క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. వేలాదిగా తమ సలహాలు.. సూచనలు.. డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. కొన్నిచోట్ల అయితే ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు చేపట్టిన పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేసిన మండలాల విషయంలో అసంతృప్తికి లోనై.. తీవ్ర వేదనతో ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొత్త జిల్లాల కసరత్తు కారణంగా రెండు నిండు ప్రాణాలు బలవంతంగా తమను తాము చంపేసుకున్నాయి. ఇంతకీలకమైన వార్త.. ప్రధాన దినపత్రికల్లో అచ్చుకాకపోవటాన్ని ఏమనాలి? తెలుగు దినపత్రికల్లో (ప్రధాన పత్రికను ఉద్దేశించి సుమా) కనిపించని ఇదే వార్తను.. జర్నలిజంలో విలువల్ని పాటించే విషయంలో అందరికంటే ముందు ఉంటుందని చెప్పే ఇంగ్లిషు పత్రికలో మొదటిపేజీలో వార్త వచ్చిన పరిస్థితి. ఒక ఇంగ్లిషు దినపత్రికలో మొదటిపేజీలో వచ్చిన వార్త.. తెలుగు దినపత్రికల్లో ప్రముఖమైన వాటిల్లో ప్రధాన పత్రికల్లో కూడా అచ్చుకాని పరిస్థితి చూసినప్పుడు ‘ఈ తెలుగు మీడియాకు ఏమైంది?.. ఎవరికి వారు వారికి తోచినట్లుగా వార్తలు ఇచ్చేస్తుంటే.. ఎవరూ నోరు మెదపరేంది?’’అంటూ సినిమా ముందు వచ్చే యాడ్ లో మాదిరి మనసు పోరు పెట్టే పరిస్థితి. మరి.. మీకు కూడా అలానే అనిపిస్తోందా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/