Begin typing your search above and press return to search.

బతికున్న మరో ప్రముఖుడ్నిమీడియా చంపేసింది?

By:  Tupaki Desk   |   15 Oct 2015 5:05 AM GMT
బతికున్న మరో ప్రముఖుడ్నిమీడియా చంపేసింది?
X
పెరిగిన పోటీ.. ముందు ఉండాలన్న తపన.. కలగలిసి హడావుడిగా..​ ఖరారు చేసుకోకుండానే వ్యవహరిస్తోంది మీడియా. ఆ మధ్య కొందరి సినీ ప్రముఖుల విషయంలో జరిగిన తప్పే మరోసారి ప్రముఖ సినీ నటుడు మాడా వెంకటేశ్వరరావు విషయంలో చోటు చేసుకుంది.

తనదైన కామెడీతో సినీ ప్రియుల్ని అలరించిన మాడా.. మారిన కాలంలో అవకాశాల్లేకుండా ఉన్నారు. గతంలో ఆయన పరిస్థితి భిన్నం. ​మరి ఎవరు చెప్పారో గానీ ​బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కొన్ని టీవీ ఛానళ్లలో మాడా మరణించినట్లుగా బ్రేకింగ్ న్యూస్ లు పడిపోయాయి. వెబ్ సైట్లలోనూ మాడా మరణించిన వార్తలు ప్రముఖంగా వచ్చేశాయి.

అయితే.. కాసేపటికి సీన్ మొత్తం మారిపోయింది. అప్పటివరకూ మరణించినట్లుగా బ్రేకింగ్ న్యూస్ లు వేసిన టీవీ ఛానళ్లే.. తమకేమీ తెలీనట్లుగా మాడా వెంకటేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని.. ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని (కొన్ని ఛానళ్లలో అయితే స్వల్ప అస్వస్థతకు గురైనట్లు ఇచ్చారు) బ్రేకింగ్ లు పడిపోయాయి. మరింత సమాచారం ఇస్తున్నట్లుగా ఫిలింనగర్ అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందినట్లుగా వార్తలు వచ్చాయి.

అప్పటి వరకూ కొన్ని ప్రముఖ వెబ్ సైట్లలోనూ ​ కనిపించిన​ మాడా మరణించిన వార్తలు మాయమైపోయాయి. మొత్తానికి ఒక సినీ ప్రముఖుడిని బతికి ఉండగానే చంపేసిన పాపాన్ని తెలుగు మీడియా మూట గట్టుకుందని చెప్పాలి. ఇప్పటికైనా అనవసరమైన పోటీని వదిలేసి.. నాణ్యమైన.. నమ్మకమైన సమాచారాన్ని అందించేందుకు ఏం చేయాలన్న విషయంపై మీడియా మహారాజులు ఆలోచిస్తే బాగుండు. లేకుంటే.. ఇప్పటివరకూ విశ్వసనీయతే తమ ఆస్తిగా చెప్పుకునే మీడియా సంస్థల బ్రేకింగ్ న్యూస్ ల్ని సైతం నమ్మలేని పరిస్థితి.

మరింత దారుణమైన విషయం ఏమిటంటే.. కొన్ని ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన న్యూస్ యాప్ లు మాడా మరణించినట్లు న్యూస్ అలెర్ట్ ఇస్తే.. ఒక ప్రముఖ మీడియా సంస్థ మరో అడుగు ముందుకేసి.. మాడా వెంకటేశ్వరరావు మరణానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని తెలిపినట్లుగా ప్రకటించింది. తాను తప్పు చేయటమే కాదు.. చివరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా సీన్లోకి తీసుకురావటానికి మించిన దౌర్భాగ్యం మరొకటి ఉండదేమో.