Begin typing your search above and press return to search.

తెలుగు చానెల్స్ ఆ టాపిక్ మీద డిబేట్ లేదా ... సోషల్ వైరల్

By:  Tupaki Desk   |   14 Oct 2021 9:47 AM GMT
తెలుగు చానెల్స్ ఆ టాపిక్ మీద డిబేట్ లేదా ... సోషల్ వైరల్
X
కుక్క అరిస్తే.. వార్త‌.. పిల్లి క‌నిపిస్తే.. సంచ‌ల‌నం.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించే తెలుగు మీడియా.. ఏ చిన్న సంఘ‌ట‌న‌ జ‌రిగినా.. అరిచి గ‌గ్గోలు పెట్టే తెలుగు మీడియా.. అత్యంత సంచ‌ల‌నం సృష్టించిన హెటిరో డ‌బ్బు క‌ట్ట‌ల ఉదంతంలో మాత్రం మూతికి సీలేసుకుందా! అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం.. అన్ని వ‌ర్గాల‌ను విస్మ‌యానికి గురి చేసింది. నిజానికి ఇటీవ‌ల వ‌రకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు సంబంధించిన వార్త‌లు ఇంత‌లింత‌లు చేసి ప్ర‌చారం చేశారు. ఆ టీవీ ఈటీవీ అనే తేడా లేకుండా.. ఆచానెల్ ఈచానెల్ అనే భేదం చూపించ‌కుండా.. అన్ని చానెళ్లు మా పై క‌థ‌నాల‌ను కోకొల్లలుగా పుంఖాను పుంఖానులుగా వండివార్చాయి. నిజానికి `మా`తో ప్ర‌జ‌లకు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేదు.

అయితే.. అత్యంత కీల‌క‌మైన హెటిరో డ‌బ్బు క‌ట్ట‌ల కేసును మాత్రం ఒక్క టీవీ కూడా ప్రసారం చేయ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనికి ఏమైంది? అనే ప్ర‌శ్న ఇప్పుడు స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. హైదరాబాద్లోని హెటిరో డ్రగ్స్‌ సంస్థలపై నాలుగులు రోజుల పాటు ఐటీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. ఈ సోదాల్లో సంస్థకు చెందిన పలు కంపెనీల్లోని ప్రైవేటు లాకర్లలో దాదాపు రూ.142 కోట్ల నగదును ఐటీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. దీంతో పాటు మూడు కిలోలకు పైగా బులియన్‌ రూపంలో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి.

స్వాధీనం చేసుకున్న నగదును లెక్కించడానికి, నోట్ల పరిశీలన నిమిత్తం భారతీయ స్టేట్‌ బ్యాంకుకు చెందిన ప్రత్యేక బృందాలను రప్పించినట్లు సమాచారం. నోట్లను పరిశీలించి లెక్కింపు పూర్తయ్యాక.. ఆ మొత్తాన్ని ఎస్బీఐ సెస్‌కు తరలించింది. అదే విధంగా ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, నగదు, బంగారంపై ఆరా తీసేందుకు మరొక ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఆ బృందం నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న ప్రైవేటు లాకర్లపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో హెటిరోకు చెందిన సంస్థల్లో ఐటీ సోదాలు నిర్వహించింది. అయితే.. ఇంత జ‌రిగినా కూడా .. ఏ చానెల్ దీనిపై ప‌ట్టుమ‌ని ప‌దినిముషాల ప్రోగ్రాం చేయ‌లేదు. ఒక్క లైవ్ పెట్టి.. చ‌ర్చించ‌లేదు. మ‌రి ఈ ఛానెళ్ల ల‌క్ష్యం ఏంటి? ఇది సంచ‌ల‌నం కాద‌నున్నారా? లేక ... దీని వెను క రాజ‌కీయ ఒత్తిళ్లు ప‌నిచేశాయా? అనేవి సందేహాలుగా మిగిలాయి. మ‌న‌లో మాట ఏంటంటే.. హెటిరోలో వైసీపీకి చెందిన ఒక కీల‌క నాయ‌కుడి అల్లుడు ఉండ‌డం గ‌మ‌నార్హం.