Begin typing your search above and press return to search.

నాజీ జెండా కట్టి.. ట్రక్కు తో వైట్ హౌస్ పైకి తెలుగు కుర్రాడి బరితెగింపు!

By:  Tupaki Desk   |   24 May 2023 9:56 AM GMT
నాజీ జెండా కట్టి.. ట్రక్కు తో వైట్ హౌస్ పైకి తెలుగు కుర్రాడి బరితెగింపు!
X
అమెరికా అధ్యక్షుడ్ని లక్ష్యంగా చేసుకుంటూ ఒక వ్యక్తి చేసిన ప్రయత్నం కలకలాన్ని రేపుతోంది. అయితే ఈ యువకుడు తెలుగు సంతతికి చెందిన వాడు కావటం సంచలనంగా మారింది. ప్రపంచానికి పెద్దన్న అమెరికాలో కొన్నిసార్లు చోటు చేసుకునే అనూహ్య పరిణామాల గురించి తెలిసిందే.

తాజా ఉదంతం కూడా ఈ కోవ కు చెందినదే. నాజీ జెండా కట్టిన భారీ ట్రక్కుతో అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్ హౌస్ పైకి దాడికి విఫలయత్నం చేశాడు కందుల సాయివర్షిత్. తెలుగు మూలాలు ఉన్న ఈ పందొమ్మిదేళ్ల యువకుడ్ని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వైట్ హౌస్ ఉత్తర భాగంలో భద్రత కోసం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్ ను ఢీ కొట్టి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయగా.. అతడ్ని అక్కడున్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. తాను అమెరికా అధ్యక్షుడ్ని లక్ష్యంగా చేసుకొని ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా పేర్కొనటం గమనార్హం. దీంతో.. అతని పై పలు నేరారోపణల్ని చేశారు.

మారణాయుధాల వినియోగం.. వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపటం.. దేశాధ్యక్షుడికి ప్రాణహాని కలిగించేలా చేయటం.. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం లాంటి అభియోగాలు నమోదు చేశారు. అయితే.. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆస్తుల నష్టం వాటిల్లలేదు.

ఈ పరిణామానికి సంబంధించిన సమాచారాన్ని అధ్యక్షుడు జో బైడెన్ కు వ్యక్తిగతంగా తెలియజేశారు. అమెరికాలోని ఛెస్ట్ ఫీల్డ్ కు చెందిన సాయి వర్షిత్.. మార్వ్కెట్ సీనియర్ హైస్కూల్ ద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు గుర్తించారు. అతని సోషల్ మీడియా ఖాతాల ద్వారా.. అతడి వివరాల్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.