Begin typing your search above and press return to search.

ప్రతిష్ఠాత్మక ఎన్నికల బరిలోకి మనమ్మాయి

By:  Tupaki Desk   |   14 Feb 2021 7:15 AM GMT
ప్రతిష్ఠాత్మక ఎన్నికల బరిలోకి మనమ్మాయి
X
ప్రపంచంలో దేశం ఏదైనా సరే.. భారతీయులు కానీ.. భారత సంతతికి చెందిన వారు కనిపిస్తాయి. అంతేనా.. భారత మూలాలు ఉన్న వారు అత్యుత్తమ స్థానాల్లో ఉండటం ఇప్పటివరకు విన్నాం.. చూశాం. ఎవరో దాకా ఎందుకు ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారీస్ దీనికో చక్కటి ఉదాహరణ. ఇదిలా ఉంటే.. మనమ్మాయ్ మరొకరు అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికల బరిలోకి దిగి ఆసక్తికరంగా మారారు. ఐక్యరాజ్య సమితి తదుపరి సెక్రటరీ జనరల్ పదవి కోసం భారత మూలాలు ఉన్న మహిళ ఒకరు పోటీ పడుతున్నారు. ఆమె.. 34 ఏళ్ల ఆరోరా ఆకాంక్ష.

ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి ప్రస్తుతం సెక్రటరీ జనరల్ గా వ్యవహరిస్తున్న ఆంటోనియో గుటెరస్ పదవీ కాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో జరిగే ఎన్నికల్లో ఆమె పోటీకి దిగాలని భావిస్తున్నారు. మాటకు పోటీ కాకుండా.. ఇప్పటికే ప్రచారంలోకి వచ్చేశారు. తాజాగా తన ప్రచార వీడియోను విడుదల చేసిన ఆమె హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. నిష్ఠూరంగా ఉండే నిజాల్ని నిర్మోహమాటంగా తన చిట్టి వీడియోలో చెప్పేసేంది.

గడిచిన 75 ఏళ్లలో ఐక్యరాజ్యసమితి ప్రపంచానికి ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేకపోయిందన్నారు. శరణార్థులకు రక్షణ కరువైందన్న ఆమె.. సమితి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ల అర్హతలు తనకు ఉన్నట్లుగా చెప్పుకున్నారు. ఈ కారణంతోనే తాను ఎన్నికల బరిలోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ఆడిట్ కో ఆర్డినేటర్ గా ఆమె పని చేస్తున్నారు.

అయితే.. ప్రస్తుత సెక్రటరీ జనరల్ గా వ్యవహరిస్తున్న గుటెరస్ మరోసారి ఈ పదవిని చేపట్టాలన్న ఆసక్తితో ఉన్నారు. మరి.. మనమ్మాయ్ ఆకాంక్ష తీరుతుందా? అన్నది ప్రశ్నగా మారింది. ఒకవేళ ఆకాంక్ష ఆరోరా కానీ ఎన్నికల రేసులో గెలిస్తే.. మరో అరుదైన రికార్డును క్రియేట్ చేసిన మహిళగా నిలిచిపోతారు. ఇప్పటివరకూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గా ఒక్క మహిళ కూడా ఎంపిక కాలేదు. ఆకాంక్ష ఆరోరా ఆకాంక్ష నెరవేరితే.. ఆమె తొలి మహిళగా మిగులుతారు. మరేం జరుగుతుందో కాలమే తేల్చాలి.