Begin typing your search above and press return to search.

టీడీపీలో ర‌ఘురామ చిచ్చు.. సీనియ‌ర్ నేత రాజీనామా..!

By:  Tupaki Desk   |   18 May 2021 5:30 AM GMT
టీడీపీలో ర‌ఘురామ చిచ్చు.. సీనియ‌ర్ నేత రాజీనామా..!
X
వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారం.. తెలుగుదేశం పార్టీలో చిచ్చుపెట్ట‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యంలో.. అధినేత చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుకు నిర‌స‌న‌గా ఆ పార్టీ సీనియ‌ర్ నేత రాజీనామా చేశారు. అధికారం కోసం ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌ని చంద్ర‌బాబును చూస్తుంటే జుగుప్స క‌లుగుతోంద‌న్న సీనియ‌ర్ నేత‌.. ఆయ‌న వెంట నిల‌వ‌డం ఆత్మ‌హ‌త్యాస‌దృశ్య‌మేనంటూ బ‌హిరంగ లేఖ రాయ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాష్ట్ర‌ మైనారిటీ క‌మిష‌న్ చైర్మ‌న్ జియావుద్దీన్ పార్టీకి రాజీనామా చేశారు. దివంగ‌త లాల్ జాన్ బాషా సోద‌రుడే జియావుద్దీన్. మొదట్నుంచీ టీడీపీలో ప‌నిచేస్తున్న ఈయ‌న‌.. ఉన్న‌ట్టుండి వైదొల‌గాల‌ని నిర్ణ‌యించుకున్నారు. టీడీపీకి తాను ఎందుకు రాజీనామా చేయాల‌నుకుంటున్న‌దీ సుదీర్ఘంగా మూడు పేజీల లేఖ‌లో వివ‌రించారు.

అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక‌విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న బాబు.. పోయిన త‌ర్వాత మ‌రోర‌కంగా న‌డుచుకుంటున్నార‌ని లేఖ‌లో ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఇటీవ‌ల జ‌రిగిన హిందూ దేవాల‌యాల విగ్ర‌హాల ధ్వంసాన్ని మ‌తాల మ‌ధ్య‌ వివాదంగా మార్చార‌ని, ఇప్పుడు ర‌ఘురామ‌కృష్ణంరాజు వ్య‌వ‌హారంలో కులాల మ‌ధ్య చిచ్చుపెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఈ విష‌యంలో చంద్ర‌బాబు ప‌డుతున్న త‌ప‌న చూస్తుంటే.. అధికారం కోసం ఎంత‌కైనా తెగించాల‌నే చంద్ర‌బాబు నీచ మ‌న‌స్తత్వం అద్దం ప‌డుతోంద‌ని లేఖ‌లో పేర్కొన్నారు జియావుద్దీన్. సొంత పార్టీ నాయ‌కుల‌ను అరెస్టుచేసిన‌ప్ప‌టిక‌న్నా ఎక్కువ‌గా ఇప్పుడు స్పందిస్తున్నార‌ని పేర్కొన్నారు. మ‌రి, ఇంతా ఎందుకు త‌పిస్తున్నారో ఆయ‌నే తెలియాల‌ని ఎద్దేవాచేశారు. ఇందుకోసం ఏకంగా.. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

చంద్ర‌బాబు ఈ జ‌న్మ‌లో మార‌రు అన్న విష‌యం అర్థ‌మైంద‌ని పేర్కొన్న జియావుద్దీన్.. కుట్ర‌లు, వెన్నుపోట్లే పునాదిగా సాగే తెలుగుదేశంలో కొన‌సాగ‌డానికి త‌న మ‌న‌స్సాక్షి అంగీక‌రించ‌ట్లేద‌ని ఘాటుగా స్పందించారు. అందుకే రాజీనామా చేస్తున్నాని పేర్కొన్నారు. జియావుద్దీన్ వంటి సీనియ‌ర్ నేత ఈ విధంగా స్పందిస్తూ పార్టీని వీడ‌డం.. రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్ర‌బాబు వ్య‌వ‌హార‌శైలి మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రి, దీనికి బాబు అండ్ కో ఎలా స్పందిస్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.