Begin typing your search above and press return to search.

టీడీపీ లో ఇలా అయితే.. క‌ష్ట‌మే!

By:  Tupaki Desk   |   24 Nov 2020 2:30 AM GMT
టీడీపీ లో ఇలా అయితే.. క‌ష్ట‌మే!
X
టీడీపీ నేత‌లు ఒక్కో జిల్లాల్లో ఒక్కో విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో వీరి వ్య‌వ‌హార శైలి.. రాజ‌కీయంగా తీ వ్ర విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇస్తోంది. అదేస‌మ‌యంలో పార్టీని సైతం క‌కావిక‌లం చేస్తోంది. ఈ ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దేందుకు చంద్ర‌బాబు ఇటీవ‌ల పార్ల‌మెంట‌రీ జిల్లా ప‌ద‌వులు.. రాష్ట్ర పార్టీ ప‌ద‌వులు పందేరం చేశారు. అయిన‌ప్ప‌టికీ.. నేతల మ‌ధ్య మార్పు క‌నిపించ‌లేదు. ప‌ద‌వులు పొందిన వారు ఒక విధంగా వ్య‌వ‌హ‌రిస్తుం టే.. ప‌ద‌వులు మిస్స‌యిన వారు మ‌రో విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో దాదాపు అన్ని జిల్లాల్లోనూ పార్టీ ప‌రిస్థితి మ‌ళ్లీ ఇబ్బందుల్లో ప‌డింది.

ఈ క్ర‌మంలో తాజాగా అనంత‌పురం, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో వెలుగు చూసిన వ‌రుస ఘ‌ట‌న‌లు తీవ్ర ఆశ్చ‌ర్యాన్ని మిగులుస్తున్నాయి. అనంత‌పురంలో అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత‌ల దూకుడు మామూలుగా లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. సొంత పార్టీలోనే ఇక్కడ పెత్త‌నం చేసేందుకు ప్ర‌భాక‌ర్‌చౌద‌రి.. వ‌ర్సెస్ జేసీ కుమారుడు మ‌ధ్య తీవ్ర వివాదాలు జ‌రుగుతున్నాయి. ప‌ద‌వుల విష‌యం లోనూ వీరిమ‌ధ్య పోరు పెరుగుతోంది. చంద్ర‌బాబు.. ప్ర‌భాక‌ర్‌కు ప‌ద‌వి ఇచ్చారు. కానీ.. జేసీ కుటుంబాన్ని ప‌క్క‌న పెట్టారు.

విజ‌య‌న‌గ‌రంలో అశోక్ గ‌జ‌ప‌తి రాజ‌కీయాలు అడ‌క‌త్తెర‌లో ప‌డ్డాయ‌ని అంటున్నారు. ఆరోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆయ‌న పార్టీకి, కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇక‌, త‌న కుటుంబంలోనే కుమార్తె అదితిని రాజ‌కీయాల్లోకి తెచ్చినా ఆశించి ఫ‌లితం రాబ‌ట్ట‌లేక పోయారు. ఇక‌, కొన్నాళ్లుగా ఆమె కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. శ్రీకాకుళంలో ఒక్క అచ్చెన్న కుటుంబం త‌ప్ప ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఎవ‌రి మాటా వినిపించ‌డం లేదు. కేవ‌లం వారి క‌నుస‌న్న‌ల్లోనే అంతా జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో కేడ‌ర్ నిరుత్సాహంలో మునిగిపోయింది.

కృష్ణాజిల్లాలో టీడీపీ నేత‌ల ప‌రిస్థితి ఎవ‌రి దారి వారిదే.. అన్న‌ట్టుగా ఉంది. ఎవ‌రికి ఎవ‌రూ లెక్క‌చేయ‌డం లేదు. మీడియా మీటింగ్ పెట్టాల‌న్నా.. పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించాల‌న్నా.. ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న దూకుడు స్వ‌భావం.. పార్టీకి మైన‌స్ అవుతోంద ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ ప‌రిణామాలు పార్టీని కోలుకోనీయ‌కుండా చేస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.