Begin typing your search above and press return to search.

ఇన్ని మాటలు చెప్పే కొడాలి నాని చేతికున్న దారాలు విప్పరేం?

By:  Tupaki Desk   |   22 Sep 2020 5:45 AM GMT
ఇన్ని మాటలు చెప్పే కొడాలి నాని చేతికున్న దారాలు విప్పరేం?
X
వెనుకా ముందు చూసుకోకుండా.. దూకుడుగా మాట్లాడటం ఇప్పటి రాజకీయ నేతల్లో చాలామంది బాగా అలవాటు చేసుకుంటున్నారు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఏపీ మంత్రి కొడాలి నాని గడిచిన నాలుగైదు రోజులుగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన మాటల క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో హడావుడి చేస్తున్నాయి. నాని మాటలు విన్న వారంతా కారాలు.. మిరియాలు నూరుతున్నారు. ఎంత హిందువు అయితే మాత్రం ఈ తీరులో నోరు పారేసుకుంటారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

తప్పు జరిగితే ఆత్మరక్షణలో పడి మాట్లాడటం ఇప్పటివరకు చూశాం. అందుకు భిన్నంగా కొత్త తరహా రాజకీయాన్ని కొడాలి నాని షురూ చేశారని చెబుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి అన్యమతస్తులు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి? సంప్రదాయం.. ఆచారం పేరుతో లేనిపోని నిబంధనల్ని తెస్తున్నారు.. డిక్లరేషన్ ఇవ్వకుండా దర్శనానికి వెళితే.. దేవుడు ఏమంటారు? అంటూ నోరు పారేసుకోవటం తెలిసిందే.

అంతేకాదు.. అంజనేయస్వామికి చెయ్యి విరగ్గొడితే ఆంజనేయస్వామికి పోయేదేం లేదు.. అదంతా బొమ్మే కదా? దేవుడి రథం వెండి దొంగలిస్తే ఏం జరుగుతుంది? మహా అయితే పది కేజీల వెండి. ఆరేడు లక్షలు అవుతాయి. దాంతో మేడలు.. మిద్దెలు కట్టేదేమీ లేదు. గుడికి వచ్చే లాస్ ఏమీ లేదు. కోటి రూపాయిల రథం తగలబడితే.. ప్రభుత్వం కొత్త రథాన్ని తయారు చేయిస్తుంది.. దాని వల్ల దేవుడికి పోయేదేమీ లేదంటూ కొడాలి నాని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

దీనిపై పలువురు మండిపడుతున్నారు. ఇంత బరితెగింపా? అంటూ విస్మయాన్ని కొందరు వ్యక్తం చేస్తూ నాని మాటలకు కౌంటర్ ఇచ్చేస్తున్నారు. ఇన్ని మాటలు హిందువుల గురించి అంటున్నారు కానీ.. మిగిలిన వారిని అనగలరా? అని ప్రశ్నిస్తున్నారు. ఆలయాలు.. దేవుడికి సంబంధించిన అంశాల్ని చాలా సింఫుల్ గా తీసేస్తున్న కొడాలి నానికి సూటిగా ప్రశ్నలు వేస్తున్న వారు లేకపోలేదు. ఆంజనేయుడి విగ్రహానికి చేయి విరిగితే నష్టమేమిటని ప్రశ్నించే నాని.. తన చేతికి ఉన్న దేవుడి దారాల్ని ఎందుకు విప్పతీయరు?అని ప్రశ్నిస్తున్నారు. నోటికి వచ్చినట్లుగా మాట్లాడే నాని తమ మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ ఇప్పుడు పెరుగుతోంది. ఇలాంటి కౌంటర్ల తర్వాత అయినా.. నాని తన చేతికి ఉన్న దారాల్ని తీసేస్తారంటారా?