Begin typing your search above and press return to search.

నీ భూముల్ని పేదలకు ఎప్పుడు పంచుతున్నావ్ నాని?

By:  Tupaki Desk   |   11 Sept 2020 11:30 AM IST
నీ భూముల్ని పేదలకు ఎప్పుడు పంచుతున్నావ్ నాని?
X
తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న ఏపీ మంత్రి కొడాలి నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలుగు తమ్ముళ్లు. తరచూ ఏదోలా నోరు పారేసుకోవటం.. తన ఎక్స్ బాస్ పై నిప్పులు కురిపించే నాని.. ఇటీవల అమరావతి రైతులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన తీరును తీవ్రంగా తప్పు పట్టేస్తున్నారు.

రాజధాని అమరావతి కోసం తమ పొలాల్ని త్యాగం చేసిన రైతుల భూముల్ని పేదలకు పంచాలన్న కొడాలి నాని.. తొలుత తన సొంత స్థలాల్ని పేదలకు పంచాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆదర్శాలు వల్లించే ముందు.. కొడాలి నాని తనకు తానుగా అమలు చేయాలని కోరుతున్నారు. రైతుల పొలాల్ని సెంట్ల రూపంలో పంపిణీకి అంగీకరించకుంటే.. రాజధానిగా అమరావతి ఉండదని వ్యాఖ్యానించటం సరికాదని వారు చెబుతున్నారు.

అహంకారంతో వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నాని.. తన బినామీలకు పనులు అప్పగిస్తూ లాభ పడుతున్నారంటూ ఆరోపించారు. రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న విషయాన్ని మరిచి.. నోరు పారేసుకుంటున్న తీరు చూస్తే.. నానికి మతి భ్రమించిందా? అన్న సందేహం తమకు వస్తున్నట్లుగా టీడీపీ నేతలు దింట్యాల రాంబాబు తదితరులు పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతులను ఉద్దేశించి విమర్శలు చేసే వారు ఎవరైనా సరే.. తొలుత తమ భూముల్ని పేదలకు అప్పగించిన తర్వాతే మాట్లాడాలని కోరితే సరిపోతుందన్న మాటకు నాని ఎలా స్పందిస్తారో?