Begin typing your search above and press return to search.

ఇప్పుడు కూడా చవకబారు రాజకీయమేనా ?

By:  Tupaki Desk   |   7 Dec 2020 4:00 AM GMT
ఇప్పుడు కూడా చవకబారు రాజకీయమేనా ?
X
ప్రతిపక్షమంటే ప్రతిదాన్ని వ్యతిరేకించటమే అన్నట్లుగా తయారైంది తెలుగుదేశంపార్టీ వ్యవహారం. తాజాగా ఏలూరులో ప్రజల అనారోగ్యాన్ని కూడా తన చవకబారు రాజకీయానికి వాడేసుకుంటోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్లో, బీజేపీ అద్యక్షుడు సోమువీర్రాజు చేసిన ఆరోపణలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కొందరు చిన్న పిల్లలు మరికొందరు పెద్దలు హఠాత్తుగా ఏలూరులో శనివారం సాయంత్రం అస్వస్ధతకు గురయ్యారు. ఒక్కసారిగా వందలమందికి ఫిట్స్ వచ్చి పడిపోతున్నారు. వెంటనే విషయం వైరల్ గా మారటంలో ఏలూరులో హై టెన్షన్ మొదలైపోయింది.

అనారోగ్యంతో వచ్చిన వారిని వెంటనే ఆసుపత్రుల్లో చేర్చుకుంటున్నారు. సమాచారం వచ్చిన చోటికి అంబులెన్సులను పంపించి ఆసుపత్రులకు తెప్పించుకుంటున్నారు. వెంటనే వైద్యం కూడా మొదలుపెట్టేశారు. నిజానికి రోగుల్లో ఎందుకు ఫిట్స్ వస్తున్నాయో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఒకేసారి ఫిట్స్ వచ్చి వందాలాదిమంది ఆసుపత్రుల్లో చేరటం ఇదే మొదటిసారి. దాంతో ప్రభుత్వంలో కూడా కంగారు మొదలైపోయింది. ఎప్పుడైతే విషయం బయటపడిందో వెంటనే వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళనాని ఆసుపత్రికి చేరుకుని పరిస్ధితి సమీక్షిస్తున్నారు.

విషయం తెలియగానే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వాసుపత్రి సూపరెండెంట్ తో మాట్లాడారు. సోమవారం ఉదయం ఇదే విషయమై ఏలూరుకు వెళుతున్నారు. పరిస్ధితిని గమనించిన ప్రభుత్వం మంగళగిరిలోని ఎయిమ్స్ నుండి వైద్య నిపుణులను ఏలూరుకు పంపింది. ఇతర ప్రాంతాల్లోని నిపుణులకు కూడా పరిస్ధితిని వివరించి చర్చలు జరుపుతోంది. బాధితులందరి నుండి రక్త నమూనాలను సేకరించి ల్యాబరేటరీలకు పంపింది. పరిస్దితి సీరియస్ గా మారే అవకాశాలుండటంతో ఇంటింటి సర్వే కూడా మొదలుపెట్టింది.

ఇది బాధితులు, రోగుల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు. మరి మన చంద్రబాబు, లోకేష్ ట్విట్టర్లో ప్రభుత్వంపై విరుచుకుపడిపోయారు. ఐదురోజుల నుండి ప్రజలు అస్వస్ధతకు గురవుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందట. సమస్య బయటపడిందే శనివారం నుండైతే వీళ్ళకు ఐదురోజుల నుండని ఎవరు చెప్పారో. వందల సంఖ్యలో చిన్నారులు, పెద్దలు అనారోగ్యానికి గురవుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందట. ప్రజల ప్రాణాలను కాపాడే అవకాశాలున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పరిస్ధితి సీరియస్ అయిపోతోందంటు రెచ్చిపోయారు. వింత రోగమని, మాస్ హిస్టీరియా అంటు ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలను వెంటనే కట్టిపెట్టాలంటు మండిపోయారు.

తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు ప్రభుత్వం మాస్ హిస్టీరియా అనే డ్రామా మొదలుపెట్టిదంటు ట్విట్టర్ వేదికగా ఆరోపణలు గుప్పించటమే ఆశ్చర్యంగా ఉంది. నిజానికి వందలాది మంది ఒకేసారి ఫిట్స్ వచ్చి అనారోగ్యం పాలవ్వటం దేశంలోనే ఎక్కడా జరగలేదు. ఎందుకు ఇలా జరుగుతుందో వైద్య నిపుణులే చెప్పలేకపోతున్నారు. ఇందులో ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలేమిటో ? ప్రభుత్వ వైఫల్యమేముందో అర్ధం కావటం లేదు. బాధితులను పరామర్శించటంలో తప్పులేదు కానీ ఇదే సాకుగా చేసుకుని ప్రభుత్వంపై బురదచల్లాలన్న లోకేష్ ప్రయత్నాలే ఆశ్చర్యంగా ఉంది. బాధితుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కళ్ళకు కనబడుతున్నా కావాలనే బురదచల్లేస్తానంటే ఎవరు చేయగలిగేదీ ఏమీలేదు.