Begin typing your search above and press return to search.

గోవా సీఎం చేసినట్లు చేస్తే తెలుగు సీఎంలు హీరోలవుతారు

By:  Tupaki Desk   |   4 Nov 2021 7:33 AM GMT
గోవా సీఎం చేసినట్లు చేస్తే తెలుగు సీఎంలు హీరోలవుతారు
X
ఇటీవల కాలంలో పెరిగిపోతున్న పెట్రోల్.. డీజిల్ ధరల మీద రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికారపక్ష నేతలు సందర్భానికి అనుగుణంగా ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే. కేంద్రం ధరలు తగ్గించాలని కోరే వారు.. రాష్ట్రాలకు వచ్చే పన్ను ఆదాయాన్ని కాసింత తగ్గించుకోవచ్చు కదా? అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఉండిపోతున్న పరిస్థితి. ఇప్పుడు కేంద్రం పెట్రోల్.. డీజిల్ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

కేంద్రం తన వంతుగా ధరల్ని తగ్గించినప్పుడు.. రాష్ట్రాలు కూడా తలో చేయి వేస్తే.. ధరలు తగ్గుతాయి కదా? అన్న ప్రశ్నకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించలేదు కానీ.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించారు. మోడీ సర్కారు పెట్రో ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న వెంటనే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని కొన్ని రాష్ట్రాలు ఆ దిశగా ప్రకటనలు చేవాయి. అసోం.. మణిపూర్.. త్రిపుర.. గోవా రాష్ట్రాల్లో లీటరుకు రూ.7 చొప్పున తగ్గిస్తున్నట్లు పేర్కొన్నాయి.

తాజా ప్రకటనతో ఈ రాష్ట్రాల్లో పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఎందుకంటే.. కేంద్రం ప్రకటించిన లీటరు రూ.5, రూ.10 ఎక్సైజ్ సుంకంతో పాటు ఇతర పన్నులు ఆ మేర తగ్గటం ద్వారా మరింత ధర తగ్గటం ఖాయం. దీనికి తోడు ఆయా రాష్ట్రాల్లో లీటరుకు రూ.7 చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం వల్ల ఆయా రాష్ట్రాల ప్రజలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ మీద కనీసం రూ.14 మేర.. డీజిల్ మీద రూ.19 మేర తగ్గనుంది. మరి.. ఇలాంటి నిర్ణయమే సంక్షేమ పథకాల్ని భారీగా అమలు చేసే ముఖ్యమంత్రులున్న తెలుగు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చేస్తుందో. అదే జరిగితే.. ప్రజలకు అసలుసిసలు దీపావళిగా మారుతుందనటంలో సందేహం లేదు.