Begin typing your search above and press return to search.

ఆప్ ను చూసి తెలుగు సీఎంలు నేర్చుకోవాలా?

By:  Tupaki Desk   |   31 May 2022 1:30 AM GMT
ఆప్ ను చూసి తెలుగు సీఎంలు నేర్చుకోవాలా?
X
రాజ్య‌స‌భ‌కు త‌మ త‌ర‌ఫున అభ్య‌ర్థుల ఎంపిక‌లో ఆప్ కొత్త విధానం పాటించింది. ఇద్ద‌రు ప‌ద్మశ్రీ పురస్కార విజేత‌ల‌కు ఈ అరుదైన గౌర‌వం ఇచ్చింది. గ‌తంలో ఓ సారి తెలుగుదేశం కూడా ఇలానే జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్ర‌హీత సినారె ను రాజ్య‌స‌భ‌కు పంపింది. గౌర‌వం చాటుకుంది. ఒక‌ప్పుడు క‌వులూ, క‌ళాకారుల‌కూ మంచి స్థానం ఉండేది.

వాళ్ల‌కు త‌గ్గ గౌర‌వం కూడా బాగుండేది. జావేద్ అక్త‌ర్ కూడా రాజ్య‌స‌భ‌కు వెళ్లిన వారే ! కాంగ్రెస్ త‌ర‌ఫున ఆయ‌న గొంతుక వినిపించారు. అప్ప‌ట్లో ఆ విధంగా ఉండేవి ఎంపిక‌లు. కానీ ఇప్పుడు మొత్తం సీన్ మారిపోయింది. క‌వులూ క‌ళాకారులూ కాకుండా పారిశ్రామిక వేత్త‌ల‌కు ఛాన్స్ వ‌స్తోంది. ఆ విధంగా అంబానీ కు ఓ సారి ఛాన్స్ వ‌చ్చింది. ఆయ‌న కోటాలో ప‌రిమ‌ళ్ నత్వానీ వెళ్లారు. అదానీ కూడా ట్రై చేశారు కానీ ఎందుక‌ని ఈ గొడ‌వ అని వ‌ద్దు అని అనుకున్నారు.

ఇక ఆప్ త‌ర‌ఫున పెద్ద‌ల స‌భ‌కు వెళ్లే వారిలో సంత్ బ‌ల్బీర్ సింగ్ సించేవాల్, విక్ర‌మ్ జిత్ సింగ్ సాహ్న‌వి అనే ఇద్ద‌రు ప‌ద్మ పుర‌స్కార గ్ర‌హీత‌ల‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. వీళ్లిద్ద‌రూ సామాజిక బాధ్య‌త మెండుగా ఉన్న పెద్ద‌లు. పర్యావరణ ప్రేమికుడు పద్మశ్రీ సంత్ బల్బీర్ సింగ్ సించేవాల్, మరొకరు పంజాబీ సంస్కృతికి సంబంధించిన పద్మశ్రీ విక్రమ్‌జిత్ సింగ్ సాహ్ని. .. ఇద్దరికీ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ తరఫున శుభాకాంక్షలు అంటూ ప్ర‌స్తుతం ఇక్క‌డి వ్య‌వ‌హారాలు చూస్తున్న ఇందిరా శోభన్ సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.

పెద్దల సభకు పంపండం అంటే, నామినేట్ చేయ‌డం అంటే ప్రజా సేవలో అంకితభావం ఉన్న వారిని ఎంపిక చేయడం ఓ సాంప్రదాయం అని ఆమె వ్యాఖ్యానించారు కూడా !

కానీ తెలుగు రాష్ట్రాల‌లో ఎంపికైన వారిలో ఒక్క‌రంటే ఒక్క‌రూ కూడా క‌ళా రంగానికి కానీ సాంస్కృతిక రంగానికి కానీ చెందిన వారు లేరు. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల‌కూ సంబంధించి ఆరుగురికి నేరుగా ఛాన్స్ వ‌చ్చింది. వీళ్ల ప‌ద‌వీ కాలం ఆరేళ్లు ఉంటుంది. వీరితో పాటు ఎంపికైన గాయ‌త్రి ర‌వి కి మాత్రం రెండేళ్ల ప‌ద‌వీ కాలం ఉంటుంది.

ఇక మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారిలో ఆర్.కృష్ణ‌య్య, సాయిరెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, బీద మ‌స్తాన్ రావు, దివ‌కొండ దామోద‌ర్, పార్థ సార‌ధి రెడ్డి ఉన్నారు. వీళ్ల‌లో ఎవ్వ‌రూ కూడా సామాజిక సేవా రంగానికి చెందిన వారు అయితే కాదు. ఆ విధంగా చూసుకుంటే జ‌గ‌న్ కానీ కేసీఆర్ క‌న్నా ఆప్ నిర్ణ‌యాలే బాగున్నాయ‌ని నెటిజ‌న్లు కేజ్రీవాల్ ను ప్రశంసిస్తున్నారు.