Begin typing your search above and press return to search.

కడుపులో కత్తులు దాచుకుంటూ పెదాల మీద నవ్వులు

By:  Tupaki Desk   |   22 Sep 2016 3:16 AM GMT
కడుపులో కత్తులు దాచుకుంటూ పెదాల మీద నవ్వులు
X
సేమ్ టు సేమ్. ఇద్దరు చంద్రుళ్లు కలిసిన వేళ.. ఎప్పుడూ ఏం జరుగుతుందో మరోసారి అదే జరిగింది. రాష్ట్ర విభజన జరగటం.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు చంద్రుళ్లు ముఖ్యమంత్రులు కావటం తెలిసిందే. రాజకీయంగా తూర్పు.. పడమరలుగా ఉండే ఈ ఇద్దరు చంద్రుళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహరిస్తుంటారు. ఎవరికి వారుగా ఉన్నప్పుడూ ఒకరంటే ఒకరికి అస్సలు పడనట్లుగా ఉంటారు. చేతల్లో సైతం ఇదే తీరును ప్రదర్శిస్తుంటారు. అదే సమయంలో ఎవరైనా మరొకరికి సాయం చేస్తే మాట వరసకు కూడా ప్రస్తావించటం ఉండదు.

ఆ మధ్య విశాఖను ముంచెత్తిన హుధూద్ తుపాను సమయంలో భారీ ఎత్తున కరెంటు స్తంభాలు.. కరెంటు సామాగ్రి ధ్వంసమయ్యాయి. ఆ విపత్తు సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిన తీరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. విశాఖకు అవసరమైన కరెంటు సామాగ్రితో పాటు.. పెద్ద ఎత్తున విద్యుత్ కార్మికుల్ని యుద్ధప్రాతిపదికన విశాఖకు పంపారు. అపత్ కాలంలో ఏమైనా జరిగితే సాటి తెలుగువాడిగా తాను సాయం చేస్తానన్న విషయాన్ని చేతల్లో చూపించారు. ఇలాంటి విషయాలు బయట ప్రపంచానికి తెలీటం ద్వారా.. రెండు రాష్ట్రాల మధ్య.. రాష్ట్ర ప్రజల మధ్య ఇచ్చి పుచ్చుకునే ధోరణి పెరగటంతో పాటు.. ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది. ఏదైనా ఇవ్వాలన్నా.. వదులుకోవాలన్నా సర్లే అన్న భావన కూడా కలుగుతుంది.

కేసీఆర్ మాదిరే ఏపీ ముఖ్యమంత్రి సైతం స్పందిస్తుంటారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో చిక్కుకుపోయిన వారిలో తెలంగాణ వారా? ఆంధ్రా వాళ్లా అన్న విషయాన్ని పట్టించుకోకుండా తెలుగువాళ్లు అయితే చాలన్నట్లుగా వ్యవహరించటం.. వారికి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించని అంశాల్లోనూ బాబు బ్యాచ్ దూసుకెళుతుంటుంది. కానీ.. ఇలాంటివి పెద్దగా బయటకు రాని పరిస్థితి.

ఇలా సాటి తెలుగు ప్రజల విషయంలో ఇద్దరు చంద్రుళ్లు పరిణితిని ప్రదర్శించి.. అపత్ కాలంలో ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటారనే చెప్పాలి. ఇలా ఉండే ఇద్దరు చంద్రుళ్లు.. అదే ప్రజల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతుంటారు. ఎందుకలా అంటే.. అదే రాజకీయమంటేనన్న సమాధానం వస్తుంది. విధానాల పరంగా ఉత్తర.. దక్షిణ ధ్రువాలుగా ఉండే వీరు.. రాష్ట్ర ప్రయోజనాల పేరుతో ఒకరిపై ఒకరు కత్తులు నూరుకోవటం కనిపిస్తుంది. మరి.. ఇలాంటి వీరిద్దరూ ఏదైనా వేదిక మీద కలిస్తే మాత్రం.. నవ్వులు చిందించటం.. ఒకరి చేతిలో ఒకరు చేతులు కలుపుకోవటం.. లాంటివి చేస్తుంటారు. తాజాగా అలాంటి సీనే ఢిల్లీలోనూ రిపీట్ అయ్యింది.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల పంచాయితీలను ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు సుప్రీం ఆదేశాల నేపథ్యంలో కేంద్ర మంత్రి ఉమాభారతి నడుం బిగించటం.. ఈ చర్చలకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావటం తెలిసిందే. ఈ భేటీలో ఇద్దరు చంద్రుళ్లు ఎలా వ్యవహరిస్తారన్న విషయం మీద అందరూ ఫోకస్ చేశారు. దీనికి తగ్గట్లే ఇద్దరు చంద్రుళ్లు.. ఎవరికి వారు ఏ మాత్రం తగ్గకుండా.. తాము ఎంత సానుకూల దృక్ఫధంతో ఉన్నామన్న భావనను కలిగించేలా వ్యవహరించారు. మరింత పాజిటివ్ నెస్ ఉంటే.. ఇద్దరు చంద్రుళ్లు ఒకచోట కూర్చొని చర్చల ద్వారా ఇష్యూలను ఒక కొలిక్కి తెచ్చుకోవచ్చు కదా? వీరిద్దరిని ఒక చోట చేర్చటానికి కేంద్రం ఎందుకు నడుం బిగించాల్సి వచ్చింది? అన్న ప్రశ్నలు వేసుకుంటే అర్థమయ్యేది ఒక్కటే. చిరు నవ్వులు చిందించుకోవటం.. షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవటమే తప్పించి.. ఇరు రాష్ట్రాల మధ్యనున్న పంచాయితీలతో ఎవరికి వారు తమ రాష్ట్రాల ప్రయోజనాల పేరుతో.. రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా బలోపేతం కావటానికి అవకాశం ఉన్న ఏ అంశాన్ని వదిలిపెట్టరని. కడుపులో కత్తులు దాచుకుంటూ పెదాల మీద నవ్వులు చిందించటం ఇద్దరు చంద్రుళ్లకు మాత్రమే సరిపోతుందేమో.