Begin typing your search above and press return to search.

పట్టాభిరామ్ కారు అద్దాలు పగిలినా.. జగనే చేయించినట్లా?

By:  Tupaki Desk   |   4 Oct 2020 6:00 PM IST
పట్టాభిరామ్ కారు అద్దాలు పగిలినా.. జగనే చేయించినట్లా?
X
ఏపీలో ఏం జరిగినా ఏపీ అధికారపక్షం చేసినట్లేనా? రుజువులు.. ఆధారాలు చూపించి మాట్లాడటం పోయి.. మనసుకు ఏం తోస్తే అదే నిజమని నమ్మేయటమే కాదు.. జనాల్ని నమ్మించే కొత్త ప్రోగ్రామ్ కు తెర తీస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. తాజాగా చోటు చేసుకున్న పరిణామం చూస్తే.. ఇదే విషయం అర్థం కాక మానదు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఉన్నారు కదా.

ఆయన ఖరీదైన కారు వెనుక అద్దాల్ని గుర్తు తెలియని వారెవరూ పగలగొట్టారు. దుండగులో.. అల్లరి పనులు చేసే వారో.. ఇంకెవరో? కానీ.. ఆయన మాత్రం తన కారు అద్దాలు పగలటానికి కారణం మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారేనని ఆయన బలంగా నమ్ముతున్నారు. తన ఇంటి ముందు పెట్టిన కారును ధ్వంసం చేశారని.. జగన్ అవినీతిని తాను బయటపెట్టినందుకే తన కారును ధ్వంసం చేసినట్లు చెప్పారు.

తన కారు అద్దాల్ని పగలకొట్టినంత మాత్రాన తాను భయపడనని.. తానేమీ పిరికిపందను కాదన్నారు. ఎక్కడో సర్వే రాళ్లు తీసుకొచ్చి కారును పగలకొట్టేస్తే తాను ఆందోళన చెందనని చెప్పారు. తన ఇంటి పక్కనే హైకోర్టు జడ్జి నివాసం కూడా ఉందని.. అక్కడ పోలీసు పికెట్ ఉన్నప్పటికీ తన కారును ధ్వంసం చేశారన్నారు. తన నోరు మూయించాలనే ఇలాంటి పనులు చేస్తున్నట్లుగా ఆరోపించారు.

పట్టాభిరామ్ కారును గుర్తు తెలియని వ్యక్తలు ధ్వంసం చేశారన్న సమాచారం తెలుసుకున్నంతనే పోలీసులు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. జరిగిన ఉదంతంతో భయపడనని స్పష్టం చేస్తున్నారు. అయినా పట్టాభిరామ్ లాంటి పెద్ద మనిషికి తన ఇంటి ముందు సీసీ కెమేరాలు పెట్టి లేవా? అన్నది సందేహం. సాధారణంగా హై ప్రొఫైల్ లో ఉన్న వారెవరూ సరే.. తమ ఇంటి ముందు సీసీ కెమేరాలు ఏర్పాటు చేసుకుంటారు. మరి.. పట్టాభిరామ్ ఇంటి దగ్గర పరిస్థితి ఏమిటో చూస్తే కానీ తెలిని పరిస్థితి.