పాక్ వక్ర బుద్ధికి.. ఉగ్రవాదానికి దన్నుగా వ్యవహరిస్తూ చాటుమాటుగా భారత్ ను దొంగదెబ్బ తీసేందుకు తరచూ దుర్మార్గాన్ని ప్రదర్శించే పాక్ కు దిమ్మ తిరిగిపోయేలా షాకిస్తూ భారత ప్రభుత్వం మెరుపుదాడులు జరపాలని నిర్ణయించటం.. అందుకు తగ్గట్లే కేవలం 21 నిమిషాల వ్యవధిలో టార్గెట్ ను పూర్తి చేసి రావటం తెలిసిందే. పాక్ అక్రమిత కాశ్మీర్ లోనూ.. పాక్ పరిధిలోని జేషే ఏ మహ్మద్ ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేసిన వైనంపై యావత్ భారతావని పులకించిపోతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా యుద్ధ విమానాల్ని నడిపిన వారిలో ఒకరు తెలుగోడన్న ప్రచారం సాగుతోంది. ఒకట్రెండు తెలుగు వార్తా చానళ్లు ఈ మేరకు స్క్రోలింగ్స్ వేశాయి. యుద్ధ విమానాన్ని తాను నడిపానని.. సర్జికల్ స్ట్రైక్స్ లో పాల్గొన్నట్లుగా సదరు వ్యక్తి హైదరాబాద్ లోని తన తల్లిదండ్రులకు ఫోన్ చేసిన చెప్పినట్లుగా స్క్రోలింగ్స్ వేశారు.
తాజాగా జరిపిన మెరుపుదాడుల్లో తెలుగోడు ఒకరు కీలక భూమిక పోషించారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే.. వారి వివరాలు బయటకు రాలేదు. వాస్తవానికి ఇలాంటి సున్నితమైన సమాచారం తెలిసినా.. ప్రచారం చేయకూడదు. ఎందుకంటే.. వారికి.. వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నది మర్చిపోకూడదు. అయితే.. రేటింగ్స్ మాత్రమే ప్రధానంగా మారి.. సంచలన అంశాలు తాము మాత్రమే ప్రసారం చేస్తామన్న ముద్రను కొనసాగించేందుకు వీలుగా ఈ తరహా స్క్రోలింగ్స్ వేశారన్న విమర్శ ఉంది.
ఇదిలా ఉంటే.. టీవీ చానళ్లలో వచ్చిన స్క్రోలింగ్స్ ను చూసిన ప్రముఖ మీడియా సంస్థలు.. ఆ వివరాల్ని సేకరించేందుకు ప్రయత్నించారు. కానీ.. ఆర్మీ వర్గాలు మాత్రం అలాంటి సమాచారం ఏమీ తమ వద్ద లేదని. ఒకవేళ ఉన్నా బయటకు ఇచ్చే పరిస్థితి ఉందని తేల్చి చెప్పాయి. దేశ భద్రతకు... వ్యక్తుల భద్రతకు సంబంధించిన వివరాలు బయటకు రాకపోవటమే మంచిది. ఇలాంటి విషయాల్లో మీడియా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.