Begin typing your search above and press return to search.

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసు : మరొకరు అరెస్ట్ !

By:  Tupaki Desk   |   1 Oct 2021 12:28 PM GMT
తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసు : మరొకరు అరెస్ట్ !
X
తెలుగు అకాడమీ నిధుల గోల్‌ మాల్‌ డొంక కదులుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా మరో మరొకరి అరెస్టు చేశారు. దీనితో ఈ కేసు లో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేసినట్లైంది. ఏపీ మర్కంటైల్ కో ఆపరేటివ్ సొసైటీ ఉద్యోగి మొయినుద్దీన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ, ఏపీ మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ పద్మావతిలను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. కాగా, వీరు కోట్ల రూపాయల డిపాజిట్లను దారి మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు.

తెలుగు అకాడమీ నిధులను ఈ ఇద్దరు కలిసి స్వాహా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఇద్దరు మేనేజర్లు డ్రా చేశారు. ప్రస్తుతం సిద్దంబర్ బజార్ బ్రాంచ్ మేనేజర్‌ గా పద్మావతి పనిచేస్తుండగా, కార్వాన్, సంతోష్ నగర్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌ లకు మస్తాన్ వలీ పనిచేస్తున్నారు. ఈ కేసులో విచారణ చురుగ్గా సాగుతోంది. రాత్రిలోగా మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. తెలుగు అకాడమీ ఉద్యోగులను సైతం ప్రశ్నిస్తున్నారు.

మరో ముగ్గురు తెలుగు అకాడమీ అధికారుల పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది. తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 63 కోట్ల రూపాయలు గల్లంతైనట్టు దర్యాప్తు కమిటీ గుర్తించింది. యూనియన్‌ బ్యాంక్‌ కార్వాన్‌ శాఖ నుంచి 43 కోట్లు, సంతోష్‌ నగర్‌ బ్రాంచిలో 10 కోట్లు, చందానగర్‌ కెనరా బ్యాంకు శాఖ నుంచి 10 కోట్ల రూపాయలు గల్లంతయ్యాయని తేలింది. నిధుల గోల్‌ మాల్‌ వ్యవహారంలో తెలుగు అకాడమీ అధికారుల నిర్లక్ష్యాన్ని దర్యాప్తు కమిటీ గుర్తించింది. జీహెచ్‌ ఎంసీ పరిధిలోని పది ప్రభుత్వరంగ బ్యాంకు బ్రాంచీల్లో రూ.320 కోట్ల డిపాజిట్ చేసింది. చందానగర్‌ కెనరా బ్యాంకులోని 33 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఇటీవలే రూ.20 కోట్లను అకాడమీ అధికారులు విత్‌ డ్రా చేసుకున్నారు. నిధుల గోల్‌ మాల్‌ పై త్రిసభ్య కమిటీ రేపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. అకాడమీ ఉద్యోగులను సైతం సీసీఎస్‌ పోలీసులు విచారిస్తున్నారు.