Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్ పై టెలిగ్రాఫ్ సంచలన కథనం.. ఏముంది?

By:  Tupaki Desk   |   23 Nov 2020 7:45 AM GMT
కరోనా వ్యాక్సిన్ పై టెలిగ్రాఫ్ సంచలన కథనం.. ఏముంది?
X
ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టేలా పలు వ్యాక్సిన్ పరీక్షలు జరుగుతున్నాయి. కొన్ని ప్రయోగాలు తుది దశకు రావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలానా వ్యాక్సిన్ పరిస్థితి ఇలా ఉంది? ఇంత ధరకు రానుంది? లాంటి ప్రశ్నలతో పాటు.. ఏయే ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేస్తారు? ఇలాంటివెన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో ప్రయోగాల్లో తుది దశకు చేరుకున్న వ్యాక్సిన్ కు సంబంధించిన ప్రతికూలతల గురించి వార్తలు వస్తున్నాయి. దీంతో.. ఒకలాంటి అయోమయం నెలకొంది.

ఇలాంటివేళ.. ప్రఖ్యాత మీడియాసంస్థ టెలిగ్రాఫ్ తన తాజా పత్రికలో ఆసక్తికర కథనాన్ని అచ్చేసింది. ప్రముఖ ఫార్మా కంపెనీ ఫైజర్ - బయోఎన్ టెక్ సంయుక్తంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ వినియోగానికి సంబంధించి యూకే సర్కారు వారంలో అనుమతులు ఇచ్చే వీలుందని పేర్కొంది. సదరు కథనం ప్రకారం డిసెంబరు 1 నాటికి ప్రజలకు వ్యాక్సిన్ అందిచేందుకు సిద్ధంగా ఉండాలని నేషనల్ హెల్త్ సర్వీసుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లుగా పేర్కొంది.

కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి యూకే ప్రభుత్వం 40 మిలియన్ల డోసులు ఆర్డర్ ఇచ్చింది. వీటిల్లో 10మిలియన్ల వ్యాక్సిన్ ఈ ఏడాది చివరకు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. ఇదంతా అనుకున్నది అనుకున్నట్లు జరిగితే బ్రిటన్ లోని 5 కోట్ల మందికి టీకా అందే అవకాశం ఉంది. అది కూడా ఈ ఏడాది డిసెంబరు పూర్తి అయ్యే నాటికి పంపిణీ చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.