Begin typing your search above and press return to search.

టెలికం కంపెనీలు ఏపీ సర్కారుకు వ్యతిరేకమా?

By:  Tupaki Desk   |   26 July 2015 4:28 AM GMT
టెలికం కంపెనీలు ఏపీ సర్కారుకు వ్యతిరేకమా?
X
తెలంగాణ రాష్ట్ర సర్కారు టెలిగ్రాఫిక్ చట్టం ఐదో సెక్షన్ కింద కొందరి ప్రముఖల ఫోన్లను ట్యాప్ చేయాలని కోరాయని సుప్రీం కోర్టుకు మూడు టెలికం సంస్థలు పేర్కొనటం తెలిసిందే.

తెలంగాణ సర్కారు కోరిన వెంటనే.. ట్యాపింగ్ కు ఓకే చెప్పేసిన టెలికం కంపెనీలు.. అదే సమయంలో విజయవాడ కోర్టు.. ట్యాపింగ్ కు సంబంధించిన వివరాలు తనకు సమర్పించాలని కోరితే.. అందుకు ససేమిరా అంటూ సుప్రీంకోర్టు వరకూ వెళ్లటం ఆసక్తిని రేకెత్తించే అంశం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా.. కోర్టుకు సమాచారం ఇచ్చేందుకు తప్పుకునేలా వివిధ మార్గాల్ని అన్వేషించటం.

టెలికం సర్వీసు ప్రొవైడర్ల వైఖరి చూసినప్పుడు ఒకింత అనుమానాలు రావటం ఖాయం. ఏపీకి వ్యతిరేకంగా.. తెలంగాణకు సానుకూలంగా వారి వ్యవహారశైలి ఉన్నట్లుగా సామాన్యలకు కనిపించటం ఖాయం. కానీ.. అసలు విషయం వేరే ఉందని చెబుతున్నారు.

చట్టబద్ధంగా తెలంగాణ సర్కారు ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావటం.. గుట్టుగా ట్యాపింగ్ చేయటం చేసేసిన టెలికం కంపెనీలు తాజాగా మాత్రం కోర్టుల ఆదేశించినా ససేమిరా అన్నట్లుగా వ్యవహరించటం.. ట్యాపింగ్ కు సంబంధించి తమ వద్దనున్న వివరాలు ఇచ్చేందుకు ఏ మాత్రం మక్కువ చూపించకపోవటమే కాదు.. రెండు రాష్ట్రాల మధ్య తాము నలిగిపోతున్నట్లు పేర్కొనటం గమనార్హం.

విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం వినిపిస్తున్న వాదనేమంటే.. తెలంగాణ సర్కారు కొన్ని నెంబర్లను ట్యాప్ చేయాలని కోరినప్పటికీ.. అధికారికంగానే కాక.. అనధికారికంగా కొన్ని తప్పులు జరిగాయని.. వివరాలు అందించే ప్రయత్నంలో తమ తప్పులు దొరికిపోయే అవకాశం ఉందన్న వాదన ఒకటైతే.. మరోవైపు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా చెబుతున్నారు.

తెలిసో.. తెలియకో తెలంగాణ సర్కారు అడిగిన వెంటనే ఇచ్చేసిన వివరాలు.. ఇప్పుడు తమ మెడకు గుచ్చుకుంటున్నాయన్న భావనతో పాటు.. ఈ వ్యవహారం రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని రేపుతుందన్న విషయాన్ని గుర్తించాయి. ముందుకెళితే గొయ్యి.. వెనుకకు మళ్లితే నుయ్యి అన్నట్లుగా తమ పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కళ్లు తెరిచిన టెలికం కంపెనీలు ఇకపై ఆచితూచి వ్యవహరించాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.

రాజకీయ విద్వేషాల్లో తాము పావులుగా మారకూడదని.. జరిగిందేదో జరిగిపోయిందని.. ఇకపై మాత్రం తాము ఇరుక్కోకుండా జాగ్రత్తపడాలని ఉన్నత స్థాయి ఆదేశాలు జారీ అయినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంగానే ట్యాపింగ్ వివరాల్ని బయటపెట్టేందుకు వెనక్కి తగ్గుతున్నట్లుగా చెబుతున్నారు. తమ తప్పును కవర్ చేసుకునేందుకు టెలికం కంపెనీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది.