Begin typing your search above and press return to search.

తెలంగాణ జడ్పీ పీఠాల ఫ‌లితాల్లో సిత్రాలెన్నో!

By:  Tupaki Desk   |   9 Jun 2019 6:34 AM GMT
తెలంగాణ జడ్పీ పీఠాల ఫ‌లితాల్లో సిత్రాలెన్నో!
X
ప‌వ‌ర్ కూడా డ‌బ్బు లాంటిదే. ఉన్నోడి ద‌గ్గ‌ర‌కే వెళ్లే అల‌వాటున్న డ‌బ్బు.. ప‌వ‌ర్ ఉన్నోడి ద‌గ్గ‌ర‌కే మ‌రిన్ని ప‌ద‌వులు వెళుతుంటాయి. తాజాగా తెలంగాణ‌లో ఫైన‌ల్ అయిన జ‌డ్పీ చైర్మ‌న్ల ప‌ద‌వుల్ని చూసిన‌ప్పుడు ఈ విష‌యం ఇట్టే అర్థ‌మవుతుంది. నేత‌లుగా తిరుగులేని ప‌వ‌ర్ ను చేతిలో ప‌ట్టుకొన్న నేత‌ల కుటుంబాల‌కు జ‌డ్పీ పీఠాలు వెతుక్కుంటూ వెళ్లిన వైనం ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్పాలి. తెలంగాణ‌లోని 32 జెడ్పీ పీఠాల్లో కొన్ని అధికార‌ప‌క్షంలోని ప‌వ‌ర్ పాయింట్స్ వ‌ద్ద‌కే వెళ్ల‌టం విశేషం.

టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు.. మాజీ ఎమ్మెల్యేల కుటుంబ స‌భ్యుల‌కో.. వారి బంధుగ‌ణానికే జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వులు ద‌క్క‌టం తుది ఫ‌లితాల్లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు. గ‌తంలో మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే వికారాబాద్ జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ గా ఆయ‌న స‌తీమ‌ణి సునీతా రెడ్డి ఎన్నిక కావ‌టం గ‌మ‌నార్హం. ఇదే రీతిలో నిజామాబాద్ జ‌డ్పీ చైర్మ‌న్ గా ఎంపికైన దాదాన్న‌గారి విఠ‌ల్ రావు మాజీ ఎంపీ క‌విత బంధువు.

ఇదే రీతిలో మంచిర్యాల జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ గండ్ర జ్య‌తి ఎవ‌రో కాదు.. భూపాల ప‌ల్లి ఎమ్మెల్యే క‌మ్ తాజాగా టీఆర్ఎస్ లో చేరి గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి స‌తీమ‌ణి. అదే విధంగా మాజీ మంత్రి ఉమామాధ‌వ‌రెడ్డి త‌న‌యుడు తాజాగా భువ‌న‌గిరి జ‌డ్పీ చైర్మ‌న్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ఎన్నిక‌య్యారు. మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డి కోడ‌లు డాక్ట‌ర్ అనితారెడ్డి రంగారెడ్డి జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ గా నిలిచారు. మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి బంధువే సంగారెడ్డి చైర్ ప‌ర్స‌న్ మంజుశ్రీ‌.

ఇలా ప‌వ‌ర్ ఉన్న నేత‌ల ఇళ్ల‌కు వెళ్లిన జడ్పీ పీఠాలు.. అందుకు భిన్నంగా కొన్ని చోటుచేసుకున్నాయి. ఎలాంటి ప‌వ‌ర్ లేకుండా.. ప్ర‌య‌త్నంతో జ‌డ్పీ పీఠాల్ని సొంతం చేసుకున్న ఉదంతాలు కూడా లేక‌పోలేదు. మ‌హ‌బూబాబాద్ చైర్ ప‌ర్స‌న్ గా ఎన్నికైన ఆంగోతు బిందు బీటెక్ పూర్తి చేశారు. జడ్పీ చైర్మ‌న్ల‌లో అత్యంత పిన్న‌వ‌య‌స్కురాలు ఆమె. ఆమె వ‌య‌సు కేవ‌లం 23 ఏళ్లు మాత్ర‌మే. అదే విధంగా సిద్దిపేట జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ వెలేటి రోజా శ‌ర్మ 2001లో డీఎస్సీలో ఉపాధ్యాయురాలిగా ఎంపిక‌య్యారు. ఇటీవ‌ల ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె చిన్న కోడూరు జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. అంతేకాదు.. ఇన్ఫోసిస్ లో ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసిన శ్రీ‌హ‌ర్షిణి భూపాల‌ప‌ల్లి జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ గా ఎంపిక కావ‌టం విశేషం.