Begin typing your search above and press return to search.

దయనీయం..రోడ్డు పైనే ప్రసవం

By:  Tupaki Desk   |   17 April 2020 11:10 AM GMT
దయనీయం..రోడ్డు పైనే ప్రసవం
X
లాక్ డౌన్ కారణంగా సామాన్యులు ఎన్నెన్ని కష్టాలు పడుతున్నారో చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. పెద్ద నగరాల్లో కూలి పనులు చేసుకునే వలస కార్మికులు.. ఉండటానికి ఇల్లు - తినడానికి ఇల్లు లేక తమ సామానంతా నెత్తిన పెట్టుకుని.. పిల్లల్ని నడిపిస్తూ.. సమయానికి తినకుండా.. ఎండల్లో వందల కిలోమీటర్లు నడిచి వెళ్తున్న దయనీయ దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణ సౌకర్యాలు లేక.. వైద్యం అందక అల్లాడుతున్న అభాగ్యులెందరో. బిడ్డకు జబ్బు చేస్తే అంబులెన్సు - మరే ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో లేక చేతుల్లో వేసుకుని తీసుకెళ్తుండే ఆ చిన్నారి చనిపోయిన హృదయ విదారక ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఇప్పుడు నడి రాత్రి వేళ నిండు గర్భిణి రోడ్డు పక్కన ప్రసవించిన దయనీయ ఘటన మన తెలుగు గడ్డ మీదే జరిగింది. సూర్యాపేటలో ఈ మానవీయ ఉదంతం చోటు చేసుకుంది.

సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం రామన్నగూడేనికి చెందిన ధీకొండ వెంకన్న - రేష్మ దంపతులు సూర్యాపేటలోని అన్నాదురైనగర్‌ లో నివసిస్తున్నారు. రేష్మకి బుధవారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో పురుటి నొప్పులు రావడంతో 108 అంబులెన్సుకు ఫోన్‌ చేశారు. అదే సమయంలో ఆ వాహనం పెన్‌ పహాడ్‌ మండలంలోని మరో రోగిని తరలించేందుకు వెళ్లింది. గత్యంతరం లేక వెంకన్న తన స్కూటీపై భార్యను ఎక్కించుకొని సూర్యాపేట జనరల్‌ కు బయలుదేరాడు. పాతబస్టాండు సమీపంలో పోలీసులు రోడ్డుపై వేసిన ముళ్ల కంచె అడ్డుగా ఉండడంతో ముందుకు వెళ్లలేకపోయారు. భార్యను అక్కడ దించి.. వెంకన్న పరుగున పక్కనే ఉన్న పోలీసు ఠాణాకు వెళ్లాడు. ముళ్ల కంచెను తొలగించాలని కానిస్టేబుల్‌ ను వేడుకున్నాడు. విధుల్లో తానొక్కడినే ఉన్నందున రాలేనని.. మీరే కంచె తొలగించుకొని వెళ్లాలని వెంకన్నకు సూచించాడు. అప్పటికే రేష్మకు నొప్పులు తీవ్రమయ్యాయి. బంధువులు - స్థానిక మహిళల సాయంతో ఆమె అక్కడే ప్రసవించి - ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కొద్దిసేపటి తర్వాత 108 వాహనం రాగా - తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. తల్లీ బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ రోడ్డు పక్కన ప్రసవం అంటే పరిస్థితి ఎంత దయనీయమో.. ఏమైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటన్నది ఊహించడానికే భయం కలుగుతోంది.