Begin typing your search above and press return to search.

తెలంగాణం : ల‌క్ష కోట్ల ప్రాజెక్టు ఏం చెప్పిందంటే?

By:  Tupaki Desk   |   21 Jun 2022 1:30 PM GMT
తెలంగాణం : ల‌క్ష కోట్ల ప్రాజెక్టు ఏం చెప్పిందంటే?
X
తెలంగాణ వాకిట కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణం పూర్త‌యి ఇవాళ్టితో (21 జూన్ 2022 ) మూడేళ్లు పూర్తి చేసుకుంది. భూపాల‌ప‌ల్లి జిల్లా, కాళేశ్వ‌రంలో గోదావ‌రి న‌దిపై ఈ అతి పెద్ద ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని నిర్మించారు. కేసీఆర్ సంక‌ల్పం కార‌ణంగా ఈ ప‌థ‌కం త్వ‌రిత‌గ‌తిన పూర్త‌యింద‌ని ఇప్ప‌టికీ తెలుగు రాష్ట్రాల‌లో ఇదే అతి పెద్ద ఎత్తిపోత‌ల ప‌థ‌కం అని కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఒక్క తె లుగు రాష్ట్రాల్లోనే కాదు ఆసియా ఖండంలోనే ఇది ఒక అతి పెద్ద ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ల‌క్ష కోట్లకు పైగా వెచ్చించార‌ని కానీ అనుకున్న మేర‌కు లాభ‌సాటిగా ఈ ప్రాజెక్టు నిర్వ‌హ‌ణ లేద‌ని తేలిపోయింది. నిర్వ‌హ‌ణ‌లో భాగంగా ఇప్ప‌టికీ నిర్దేశిత ల‌క్ష్యాలు చేరుకోలేక‌పోయింద‌ని కూడా అంటున్నారు నిపుణులు.

మూడేళ్లలో 127.53 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశార‌ని అంటున్నారు. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా హైద్రాబాద్ కు తాగు నీరు అందించ‌డంతో పాటు పారిశ్రామిక అవ‌స‌రాల‌కు కూడా ఈ నీటినే వినియోగించుకునే విధంగా నిర్మించినా అవ‌న్నీ ఆశించిన రీతిలో ఫ‌లించ‌లేద‌ని ఓ ఆరోప‌ణ అయితే ఉంది.

కాంట్రాక్ట‌ర్ల కాసుల క‌క్కుర్తి కూడా ప్రాజెక్టు నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌భావం చూపింద‌ని విప‌క్షాల విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. ఓ ఎత్తిపోతల ప‌థ‌కం కోసం ఇన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టి కేసీఆర్ సొంత మ‌నుషుల‌కే సాయం చేసి ఉన్నార‌ని కూడా అభియోగాలు ఉన్నాయి. కాళేశ్వ‌రం కార‌ణంగా కోటీశ్వ‌రులు అయిన టీఆర్ఎస్ పెద్ద‌లు ఆ మేరకు ప్రాజెక్టు ప‌నులు చేయ లేద‌ని కాంగ్రెస్ కూడా అనేక సార్లు ఆరోపించింది.

ప్ర‌స్తుతం రోజుకు మూడు టీఎంసీల చొప్పున 90 రోజుల‌లో 270 టీఎంసీల నీటిని ఎత్తి పోసేందుకు అద‌నంగా కన్నెపల్లి పంపుహౌస్‌ వద్ద అదనంగా మరో ఆరు మోటార్లు ఏర్పాటు చేశార‌ని ప్ర‌ధాన మీడియా చెబుతోంది. మ‌రి! ఈ క‌ల అయినా నెర‌వేరుతుందా ? అన్న సందేహం ఒక‌టి నిపుణుల నుంచి వ్య‌క్తం అవుతోంది.

ఎందుకంటే అద‌నంగా రోజుకు మూడు టీఎంసీల ఎత్తిపోత‌ల‌కు కేంద్ర జల వ‌న‌రుల మండ‌లి అభ్యంత‌రాలు చెబుతోంద‌ని ప్ర‌ధాన మీడియా అంటోంది. క‌నుక కాళేశ్వ‌రం ల‌క్ష్యం పూర్తి స్ధాయిలో నెర‌వేరుతుందా లేదా అన్న‌ది తేలాల్సి ఉంది.