Begin typing your search above and press return to search.

రాత్రి 9 దాటితే హైద‌రాబాద్ లో పెళ్లిళ్లు బంద్‌!

By:  Tupaki Desk   |   24 Jan 2018 5:48 AM GMT
రాత్రి 9 దాటితే హైద‌రాబాద్ లో పెళ్లిళ్లు బంద్‌!
X
పెళ్లిళ్ల విష‌యంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది తెలంగాణ వ‌క్ఫ్ బోర్డు. మ‌హాన‌గ‌రంలో రాత్రి 9 గంట‌లు దాటిన త‌ర్వాత కానీ పెళ్లిళ్లు చేసిన ప‌క్షంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వార్నింగ్ ఇచ్చింది. రాత్రివేళ ముస్లిం ఫంక్ష‌న్ హాళ్ల‌లో పెళ్లిళ్ల కార‌ణంగా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నార‌ని.. అందుకే తామీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఫిబ్ర‌వ‌రి 1 తేదీ నుంచి రాత్రి తొమ్మిది గంట‌లు దాటిన త‌ర్వాత పెళ్లిళ్ల‌పై నిషేధాన్ని విధిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఒక‌వేళ ఎవ‌రైనా త‌మ ఆదేశాల్ని అతిక్ర‌మించి వివాహాలు చేసుకున్న ప‌క్షంలో వారికి ఖాజీలు నోటీసులు జారీ చేస్తారు.

అంతేకాదు అలా పెళ్లిళ్లు చేసుకున్న జంట‌ల‌కు జారీ చేసే వివాహ బుక్ లెట్‌.. స‌ర్టిఫికెట్ల‌ను జారీ చేయ‌మ‌ని వ‌క్ఫ్ బోర్డు ఛైర్మ‌న్ ముహ‌మ్మ‌ద్ స‌లీం వెల్ల‌డించారు.

తాజాగా హౌజ్ హౌస్ లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పోలీసు అధికారులు.. ముస్లిం మ‌త పెద్ద‌ల‌తో క‌లిసి ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. రాత్రి పెళ్లిళ్ల స‌మ‌యంలో పెద్ద ఎత్తున మ్యూజిక్ పెట్ట‌టం.. భారీగా బాణ‌సంచా కాల్చ‌టంతో ప్ర‌జ‌ల‌కు అసౌక‌ర్యం క‌లుగుతుంద‌ని.. అందుకే రాత్రి వేళ వివాహాల్ని నిషేధిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. రాత్రివేళ వివాహాల్ని నిషేధిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం మంచి ప‌రిణామంగా జ‌మాత్ ఏ ఇస్లామీ హింద్ అధ్య‌క్షుడు హ‌మీద్ ముహ‌మ్మ‌ద్ ఖాన్‌ తో పాటు ప‌లువురు ముస్లిం మ‌త‌పెద్ద‌లు అభివ‌ర్ణించ‌టం గ‌మ‌నార్హం.