Begin typing your search above and press return to search.

చలానా మేళ.. కోట్లకు కోట్లు ఖజానాకు పొంగి పొర్లుతోంది

By:  Tupaki Desk   |   4 March 2022 7:30 AM GMT
చలానా మేళ.. కోట్లకు కోట్లు ఖజానాకు పొంగి పొర్లుతోంది
X
కొండలా పేరుకు పోయిన ట్రాఫిక్ చలానాల్ని క్లియర్ చేసేందుకు మెసేజ్ ల మీద మేసేజ్ లు పంపినా స్పందించని తెలంగాణ ప్రజలు.. ఇప్పుడు మాత్రం ఒకే ఒక్క ప్రకటనతో.. ఉరుకులుపరుగులు తీస్తున్నట్లుగా తమకున్న పెండింగ్ చలానాల్ని పూర్తి చేస్తున్న వైనం చూస్తే.. ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఎడాపెడా విధించే చలానాల్ని విధించటం ఒక ఉద్యమంగా ట్రాఫిక్ పోలీసులు వేసేవారు. నెలావారీ టార్గెట్లు విధించి మరీ వేసిన చలానాలు మొత్తంగా కోట్లాది చలానాలుగా పేరకుపోయాయే కానీ.. వాటికి విధించిన ఫైన్లు మాత్రం వసూలు కాని పరిస్థితి.

ఇలాంటి వేళ.. కోట్లాది చలానాలను క్లియర్ చేయటంతో పాటు.. కేసుల్ని ఒక కొలిక్కి తీసుకురావటం.. ఖజానాకు భారీగా ఆదాయాన్ని సమకూర్చేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు వినూత్న పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ట్రాఫిక్ చలానాల్ని క్లియర్ చేసేందుకు వీలుగా.. డిస్కౌంట్ మేళాను షురూ చేశారు. ఇందులో భాగంగా టూ వీలర్ మీద ఉన్న చలానా మొత్తంలో కేవలం 25 శాతం చెల్లిస్తే చాలు.. మిగిలిన 75 శాతం రాయితీగా ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు.

దీనికి సంబంధించిన సాఫ్ట్ వేర్ ను సిద్ధం చేసి.. ఈ నెల ఒకటి నుంచి ఈ మేళాను షురూ చేశారు. ఈ మేళాకు ఆశించిన దాని కంటే ఎక్కువ స్పందన లభిస్తోంది. తొలి మూడు రోజుల్లో ఏకంగా 40 లక్షల చలానాలు క్లియర్ అయ్యాయి. ఇందుకుగాను తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ఏకంగా రూ.40 కోట్ల ఆదాయం జమ కావటం గమనార్హం. పెండింగ్ లో ఉన్న చలనాలకు కేవలం నెల రోజుల కాల పరిమితితో డిస్కౌంట్ మేళాను నిర్వహించటం.. ఇందుకు మార్చి 31 చివరి తేదీగా నిర్ణయించటంతో.. చలానాల్ని చెల్లించేందుకు ఆన్ లైన్ లో క్యూ కడుతున్నారు.

ఈ డిస్కౌంట్ మేళా షురూ అయిన మొదటి రోజున శివరాత్రి పర్వదినం అయినప్పటికీ ఏకంగా రూ.9 కోట్ల మేర ఆదాయం ఖజానాకు వచ్చింది చేరింది. రెండో రోజున దాదాపు రూ.15కోట్ల మేర ఆదాయం వచ్చింది. ముచ్చటగా మూడో రోజున.. రూ.16 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే.. కేవలం మూడు రోజుల వ్యవధిలో పెండింగ్ చలానాలు క్లియర్ చేసుకున్న వాహనదారుల పుణ్యమా అని..తెలంగాణ రాష్ట్ర బొక్కసంలో రూ.40 కోట్లు జమ కావటం విశేషం. మరో 28 రోజుల పాటు చలానాలు చెల్లించేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. వీలైనంత త్వరగా తమకున్న పెండింగ్ చలానాలు క్లియర్ చేయటం మీద వాహనదారులు ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శించటం గమనార్హం.

కరోనా నేపథ్యంలో పెండింగ్ చలానాల క్లియరెన్సు నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ చలానా మేళాకు ఒక సెకనులో గరిష్ఠంగా 45 వేల హిట్లు వచ్చాయని.. నిమిషానికి 700 చలానాలు చెల్లింపులు జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. భారీగా పెరిగిన రద్దీని తట్టుకునేలా వెబ్ సైట్ సర్వర్ సామర్థ్యాన్ని పెంచామని.. నిమిషానికి వెయ్యి చలానాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి యథావిధిగా పాత పద్దతిలోనే జరిమానాలు విధిస్తామని.. ఈసారి చలానాలు చెల్లించకుంటే రాయితీ కల్పిస్తారన్న ఆలోచన వద్దని.. ఈసారి ఉల్లంఘనులపై చట్టప్రకారం చర్యలు ఖాయమని తెలంగాణ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. తాజాగా వసూలు అవుతున్న వసూళ్ల తీరు చూస్తే.. రికార్డు స్థాయిలో ఆదాయం ఖజానాకు చేరే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.