Begin typing your search above and press return to search.

ఎన్నారై పెళ్లిళ్ల మోసాల్లో తెలంగాణ టాప్!

By:  Tupaki Desk   |   10 July 2023 8:40 PM GMT
ఎన్నారై పెళ్లిళ్ల మోసాల్లో తెలంగాణ టాప్!
X
మా అమ్మాయికి అమెరికా సంబంధం వచ్చింది వదిన గారు.. అబ్బాయికి పెద్ద ఉద్యోగం అంట.. అక్కడే సొంత కారు కూడా ఉందంట.. ఇళ్లు కూడా కొనుక్కున్నాడంట.. పెళ్లైతే అక్కడే స్థిరపడిపోతాడంట.. పైగా ఒక్కడే కొడుకంట.. ఉన్నదంతా మా అమ్మాయికేనంట..! అవునా వదినా... అయితే మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు!

ఇలాంటి సంభాషణలు రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంటుంటాయి! అయితే ఈ అంట.. అంట.. అంటూ ఎన్నారై అబ్బాయిల విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే, పూర్తిగా వాస్తవాలు తెలుసుకోకుండా ముందడుగేస్తే జీవితంలో కోలుకోలేని దెబ్బలు తగిలే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తుంది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్‌ తెలిపిన వివరాలు షాకింగ్ గా ఉన్నాయి.

అవును... గుజరాత్‌, పంజాబ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు ఎక్కువగా ఎన్నారై సంబంధాలు చేసుకుని మోసపోతున్నారని జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ చెబుతున్నారు! "ఎన్నారైని పెళ్లి చేసుకోవడంలో సమస్యలు" అనే అంశంపై గుజరాత్‌ లోని వడోదరలో ఒక యూనివర్సిటీలో కమిషన్‌ ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు హాజరై ఆమె ఈ మేరకు కీలక విషయాలు వెళ్లడించారు.

ఈ సందర్భంగా... అబ్బాయి ఫ్రెండ్స్ తోనో, వారి చుట్టాల్తోనో, ఆఫీసులో వాళ్లతోనో మాట్లాడేసి... మాట్లాడింది కూడా వారో కాదో తెలుసుకోకుండా ఇబ్బందులు పడటం కంటే మరో మార్గం ఉందని కమిషన్ చైర్మన్ సూచించారు. ఇందులో భాగంగా... ఎన్నారై సంబంధం చేయాలనుకునే తల్లిదండ్రులు ముందుగా అబ్బాయి వివరాలు కావాలని అతను ఉండే దేశంలోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాయవచ్చని ఆమె సూచించారు.

ఇదే సమయంలో పంజాబ్‌ లూధియానాలో ఎన్నారైని పెళ్లి చేసుకుని మోసపోయిన ఒక యువతి.. తనలాగా ఎవరూ నష్టపోకూడదని ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి అందరిలో చైతన్యం తెస్తోందని అంటున్నారు. ఈ సంస్థకు ఇప్పటికే 700 మంది మోసపోయిన అమ్మాయిలు ఫిర్యాదు చేశారని సమాచారం. వీరిలో మెజారిటీ మోసాలు... అమెరికాలో ఉంటున్న అబ్బాయికి అప్పటికే అక్కడ పెళ్లైపోవడమో.. లేక మరో అమ్మయితో సహజీవనం చేస్తూ ఉండటమో జరుగుతుందని అంటున్నారు.

అదేవిధంగా... ఎన్నారైని పెళ్లి చేసుకున్న అమ్మాయిలు భర్తను గుడ్డిగా నమ్మి విదేశాలకు వెళ్లి మోసపోతున్నారని.. భర్త మోసం చేశాడని లేదా వేధించాడని ఫిర్యాదు చేసేవారు పక్కా సాక్ష్యాలు కొన్నయినా ఇవ్వగలిగితేనే వారికి సరైన న్యాయం జరుగుతుందని.. ఈ విషయంలో చాలామంది అమ్మాయిలు సాక్ష్యాలు సేకరించడం లేదని మహిళా పోలీసు అధికారులు చెబుతున్నారు.

దీంతో ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని... ఆడపిల్ల తల్లితండ్రులు, ఎన్నారై సంబంధాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. తొందరపడి తప్పటడుగులు వేయకూడదని పలువురు సూచిస్తున్నారు.