Begin typing your search above and press return to search.

కేసీఆర్ డ్రీం ప్రాజెక్టు పనులు మరీ అంత నాసిరకంగా సాగుతున్నాయా?

By:  Tupaki Desk   |   15 Jun 2020 3:45 AM GMT
కేసీఆర్ డ్రీం ప్రాజెక్టు పనులు మరీ అంత నాసిరకంగా సాగుతున్నాయా?
X
మరే రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోని రీతిలో నిర్ణయాలు తీసుకోవటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారు. ఇటీవల కాలంలో ఒక సీఎం.. ఒక దేవాలయం కోసం వందల కోట్లను ఖర్చు చేయటం ఎప్పుడైనా.. ఎక్కడైనా చూశామా? ఆ విషయంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా. ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టను యాదాద్రిగా పేరు మార్చటమే కాదు.. వందల కోట్లు ఖర్చుతో తిరుమలకు ఏ మాత్రం తగ్గని రీతిలో టెంపుల్ గా మార్చాలన్న పట్టుదలతో ఉన్నారు.

దీనికి సంబంధించిన పనుల్ని తానేస్వయంగా చూడటమే కాదు.. గుడికి సంబంధించిన డ్రాయింగ్స్ ను తానే స్వయంగా పరిశీలించి.. ఫైనల్ చేయటమే కాదు.. తరచూ సమాచారాన్ని తెప్పించుకుంటారని చెబుతారు. కేసీఆర్ డ్రీం ప్రాజెక్టుల్లో ఒకటైన యాదాద్రి దేవాలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పుడో విషయం సంచలనంగా మారింది. ఇటీవల కురిసిన ఒక మోస్తరు వర్షాలకు.. యాదాద్రి ప్రధాన ఆలయ మండపాల్లోకి వర్షపు నీళ్లు రావటం కలకలం రేపుతోంది.

ప్రధానంగా అష్టభుజి.. అంతర్గత.. బాహ్య ప్రాకార మండపాల్లో వర్షపు నీరు చేరటం అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. అద్దాల మండపంలోకి వాననీరు చేరి.. పనులు నిలిచిపోయే వరకూ వెళ్లటాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణిస్తారని చెబుతున్నారు. వర్షం నీరు ఆలయంలోకి చేరాయన్న విషయాన్ని తెలుసుకున్న అధికారులు.. ఇంజనీర్లు హుటాహుటిన ఆలయానికి చేరుకున్నారు. అక్కడి వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పనుల్ని పరిశీలించిన పిమ్మట.. ఆలయంలో చేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ.. ఎలక్ట్రికల్ వైరింగ్ పనులు పూర్తి కాకపోవటంతో మండపాల్లోకి నీరు చేరినట్లు తెలుస్తోంది. ఆలయంలో లైటింగ్.. ఏసీలు.. ఇతర అవసరాల కోసం ప్రస్తుతం వైరింగ్ పనులు జరుగుతున్నాయి. వైర్లు కనిపించకుండా వేసిన పైపుల్లోకి వర్షం నీరు వెళ్లటంతో అవి ప్రధాన ఆలయంలోకి చేరుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పనులు పూర్తి కాకపోవటంతో వాన నీరు చేరినట్లుగా అధికారులు చెబుతున్నారు.

పైకి ఈ తరహా కారణాలు చెబుతున్నా.. పనుల నాణ్యత మీద సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్లాబ్ మీద వేసిన రెయిన్ ఫ్రూప్ గట్టిపడకపోవటంతో లీకేజీలు ఏర్పడినట్లు చెబుతున్నారు. అవే.. వర్షపు నీరు ఆలయంలోకి చేరటానికి కారణంగా చెబుతున్నారు. ఒక ముఖ్యమంత్రి కలల ప్రాజెక్టు పనుల విషయంలో ఇలా జరగటం ఏమిటన్నది ఇప్పుడు చర్చగా మారింది.

వర్షాకాలం వచ్చే ముందే.. ఇలాంటి సమస్యల్ని ఎదురయ్యే అవకాశం ఎంత ఉందన్న విషయాన్ని ఇంజనీరింగ్ అధికారులు ఎందుకు చెక్ చేయలేదన్నది ఒక ప్రశ్నగా మారింది. సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రాజెక్టు విషయంలోనే ఇలాంటివి చోటుచేసుకోవటమా అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. యాదాద్రి ఆలయ పనులే ఇలా ఉంటే.. మిగిలిన వాటి సంగతేమిటి? అన్నదిప్పుడు సందేహంగా మారింది. మరీ.. వ్యవహారంపై కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారన్నది అసలు ప్రశ్న.