Begin typing your search above and press return to search.

ప్రపంచానికి తెలియని తెలంగాణ టెంపుల్ మ్యాన్

By:  Tupaki Desk   |   9 July 2020 12:30 AM GMT
ప్రపంచానికి తెలియని తెలంగాణ టెంపుల్ మ్యాన్
X
తన జీవితాంతం అదే పనిగా పెట్టుకున్నాడు. ఒక పెద్ద గుహను చెక్కి ఒక ఆలయాన్నే నిర్మించాడు. ఆ తెలంగాణ టెంపుల్ మ్యాన్ చేసిన కృషికి ఒక అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకుంది. అది ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ఇది నమ్మశక్యం కాని నిజమైనా అద్భుతమే జరిగింది..ఒక వ్యక్తి ఎంతో కష్టంతో ఒక పర్వతాన్ని తొలిచి దేవాలయంగా మార్చాడాంటే నిజంగా అద్భుతం జరిగినట్టే కదా.. ఇది చేసింది మరెవరో కాదు.. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలోని వెల్చల్ గ్రామ మనిషి. తన సంపూర్ణ సంకల్పంతో ఏమి సాధించగలడో అది చేసి చూపించాడు.

పరమయ్య దాసుగా ప్రాచుర్యం పొందిన పరమయ్య యాదవ్ హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోమిన్ పేట్ గ్రామ సమీపంలో గుట్టను ఉలితో చెక్కి ఆలయంగా మరల్చడానికి తన జీవితమంతా అంకితం చేశాడు.

క్రౌబార్, ఉలి మరియు సుత్తి మాత్రమే సాధనంగా పరమయ్య 20 మీటర్ల లోతు.. ఐదు అడుగుల వెడల్పు ఉన్న ఒక గుహను ఏర్పాటు చేయడానికి చాలా సంవత్సరాలు ఒంటరిగా శ్రమించాడు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఆలయాన్ని నిర్మించాడు. 1960లలో ఆలయాన్ని చెక్కే పని ప్రారంభించినప్పుడు పరమయ్య ఒక యువకుడని గ్రామస్తులు అంటున్నారు. ఈ ప్రాంతం అప్పుడు దట్టమైన అడవిలా ఉండేదని.. పులులు.. ఇతర అడవి జంతువులకు ప్రసిద్ది చెందిందని వివరించారు.

ఇప్పుడు 75 ఏళ్ళ వయసులో ఉన్న పరమయ్యకు మాట పడిపోయింది. కానీ తన కలలో ఒక దేవుడు కనిపించి ఒక ఆలయాన్ని నిర్మించమని కోరాడని.. ఆ తరువాతే తాను గుట్టను తొలిచి ఆలయాన్ని నిర్మించే పని చేపట్టానని గ్రామస్థులకు ఇదివరకే తెలిపాడు.

ఈ ప్రాంతంలో గొర్రెలు మేకలను పెంచుతున్నప్పుడు పరమయ్య కొండ కింద సేదతీరేవాడు. ఒక రోజు అతను అక్కడ పడుకున్నప్పుడు ఒక కల వచ్చిందట.. ఇక అప్పటి నుంచి తన జీవితమంతా ఒక గుహను చెక్కి ఆలయం నిర్మించడానికే నిర్ణయించుకున్నాడు. అతను 1970 లలో ఈ పనిని పూర్తి చేశాడని కొంతమంది చెప్తారు. కాని మరికొందరు అతను రెండు దశాబ్దాలు పనిచేశారని చెప్పారు.

బయటి నుండి, ఇది ఒక రాతిలా మాత్రమే కనిపిస్తుంది. కాని ఈ ప్రదేశానికి దగ్గరగా వెళుతున్నప్పుడు, గుహ ప్రవేశ ద్వారం మరియు లోపల ఉన్న ఆలయాన్ని చూడవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఎవరి మద్దతు లేకుండా, అతను ఒంటరిగా పనిని పూర్తి చేశాడు. అజంతా ఎల్లోరా గుహలలో ఉన్నట్లుగా తీర్చిదిద్దాడని ఆ గ్రామ ఎంపీటీసీ తెలిపారు..

పరమయ్య తన కుటుంబాన్ని.. అన్ని సంబంధాలను వదిలేసి తన జీవితమంతా ఆలయ నిర్మాణానికి అంకితం చేశాడని స్థానికులు చెబుతున్నారు. పైగా పరమయ్య చదువుకోలేదు.. రోజుకు ఒకసారి మాత్రమే తింటూ ఈ అద్భుత ఆలయాన్ని నిర్మించడం విశేషం. "నా కల నిజమైంది" అని వణుకుతున్న స్వరంతో పరమయ్య గర్వంగా చెబుతున్నారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పుడు గ్రామస్తులు ముందుకు వచ్చారు. చుట్టుపక్కల గ్రామాల నుండి.. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు సౌకర్యాలు కల్పించే ఒక కమిటీని వారు ఏర్పాటు చేశారు.

పరమయ్య అదే గుహలో నివసిస్తున్నాడు. నేరుగా దేవునికి ప్రార్థన చేయమని అతను చెప్పేవాడు. కొన్నేళ్ల క్రితమే ఆలయ పూజారిని నియమించింది.పరమయ్యను వృద్ధాప్యం వెంటాడుతున్నందున అవుతున్నందున ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక పూజరిని నియమించాలని గ్రామస్థులు చెప్పారు.

మొత్తంగా ఒక గొర్రెల కాపరికి అసాధ్యమైన పనిని.. సుసాధ్యం చేయడానికి ఆ దేవుడే తోడ్పాటునందించాడని స్థానికులు విశ్వసిస్తున్నారు.