Begin typing your search above and press return to search.

కారుతో దోస్తీకి సైకిల్ మాస్టర్ ప్లాన్..?

By:  Tupaki Desk   |   9 Feb 2017 4:44 AM GMT
కారుతో దోస్తీకి సైకిల్ మాస్టర్ ప్లాన్..?
X
రాజకీయాలకు సంబంధించినంత వరకూ పాత చింతకాయ పచ్చడి లాంటి ఒక మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. రాజకీయాల్లో శాశ్విత శత్రువు కానీ.. శాశ్విత మిత్రుడు కానీ ఉండరన్నది. తెలంగాణ రాష్ట్రంలో లోగుట్టుగా సాగుతున్న తాజాప్రయత్నాలు చూస్తే.. ఈ మాట నిజం అనిపించటమే కాదు.. ఔరా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. ‘‘2019 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాతే హైదరాబాద్ ను విడిచిపెడతాం’’ అంటూ శపధాలు చేసిన చంద్రబాబు తోక ముడిచి ఏపీకి ఎలా వెళ్లిపోయారో..? ఎందుకు వెళ్లిపోయారో తెలుగు ప్రజలందరికి తెలిసిందే.

ఏపీ మీద ప్రేమతో తాను అమరావతికి వెళ్లినట్లుగా ఆయన తరచూ చెప్పుకుంటుంటారు.చెట్ల కింద బస్సుల్లో పడుకొని మరీ పాలన సాగించినట్లుగా గొప్పలు చెబుతారు. ఒకవేళ అదే నిజమైతే.. దాదాపు రూ.15కోట్ల వ్యయంతో హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో తన పేషీని అత్యాధునిక హంగులతో ఎందుకు సిద్ధం చేసుకున్నట్లు? అన్న సూటి ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి. హైదరాబాద్ ను విడిచి పెట్టటం ఏ మాత్రం ఇష్టం లేని చంద్రబాబు.. అమరావతి వెళ్లారంటే ఓట్లకు నోటు కేసు కారణమేనన్న మాట రాజకీయ వర్గాలే కాదు.. తెలుగుతమ్ముళ్లు కూడా అవుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం మర్చిపోకూడదు.

తెలంగాణలో రాజకీయమే లక్ష్యంగా పని చేస్తామని దమ్ముగా ప్రకటించుకున్న చంద్రబాబు పార్టీ.. గడిచిన రెండేళ్ల వ్యవధిలో ఎలాంటి పరిస్థితికి దిగజారిపోయిందో తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. ప్రస్తుతం ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలే. వారిలో ఒకరు (ఆర్. కృష్ణయ్య) పార్టీతో సంబంధంలేనట్లు స్వతంత్రంగా ఉండటం మర్చిపోకూడదు. మిగిలిన పన్నెండు మందిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఓట్లకు నోటు కేసు తర్వాతే తెలంగాణ అధికారపక్షంలో భాగస్వామ్యం కావటాన్ని మర్చిపోకూడదు.

ఇక.. మండలిలో అయితే.. తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యమేలేదు. ఇలాంటి వేళ.. తెలంగాణలో పార్టీ పరిస్థితి దాదాపు చాప చుట్టేసిన చందంగా తయారవుతున్న వేళ.. అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అధికారపక్షంతో దోస్తీకి తెలుగు తమ్ముళ్లు సిద్ధం కానుండటం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో పార్టీని బతికించుకోవాలంటే టీఆర్ఎస్ తో చేతులు కలపటం.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవటం మినహా మరో మార్గం లేదన్న భావనకు పార్టీ అధినాయకత్వం డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

ఏపీలో అధికారంలో ఉండి కూడా తెలంగాణలోపార్టీని బతికించుకోలేకపోయారన్న చెడ్డపేరును మూటగట్టుకోకుండా ఉండేందుకు.. తెలంగాణలోపార్టీ బతికి బట్ట కట్టాలంటే అధికారపక్ష ఆశీస్సులు తప్పనిసరి అన్న భావన బలంగా ఉన్న టీడీపీ అధినాయకత్వం.. గతంలో తమ పార్టీ నుంచి టీఆర్ ఎస్ లోకి వెళ్లి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా మారిన మంత్రి తుమ్మల నేతృత్వంలో ఇటీవల కాలంలో ప్రయత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నయా దోస్తీకి మధ్యవర్తిగా ఒక మీడియా యజమాని యాక్టివ్ రోల్ ప్లే చేసినట్లుగా చెబుతున్నారు.

పార్టీని బతికించుకోవటం కోసం.. వలసలకు చెక్ పెట్టటం కోసం టీడీపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వాదనను అర్థం చేసుకోవచ్చు. మరి.. ఏ లాభంతో టీఆర్ ఎస్ ఇందుకు ఓకే అనటమే కాదు.. ఈ ప్రతిపాదనపై చర్చల్లో భాగంగా ఏర్పాటు చేసిన విందుకు కేసీఆర్ ఎందుకు ఓకే అన్నట్లు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఒక ఆసక్తికరమైన లాజిక్ ను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లటంతో ఆయనీ ప్రతిపాదన పట్ల ఆసక్తి ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది.

‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ దుకాణం కానీ తెలంగాణలో బంద్ అయితే.. ఆ పార్టీకున్న ఓటు బ్యాంక్ మొత్తం చెల్లాచెదురై కాంగ్రెస్ ఖాతాలోకివెళ్లటం ఖాయం. అదే జరిగితే.. ఇప్పటికిప్పుడు కాకున్నా.. భవిష్యత్తులో అయినా టీఆర్ ఎస్ కు నష్టం. అదే సమయంలో టీడీపీతో చేతులు కలిపి దోస్తీకి ఓకే అంటే.. టీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు టీడీపీ ఓటు బ్యాంకు ప్లస్ అవుతుంది. అదే జరిగితే.. అంతిమంగా టీఆర్ ఎస్ లాభపడగా.. కాంగ్రెస్ కుదెబ్బ పడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ బలపడే అవకాశం ఉండదు’’ అంటూ వినిపించిన వాదనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కన్వీన్స్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకే.. సైకిల్ తో దోస్తీకి సంబంధించిన తొలి విందు భేటీకి కేసీఆర్ హాజరైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ వ్యవహారం.. అంచనాలకు తగ్గట్లే మారితే.. సరికొత్త రాజకీయ సమీకరణ తెలంగాణలో ఏర్పడుతుందన్న భావన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో మాదిరి కాకుండా తెలంగాణ తమ్ముళ్లు.. తెలంగాణ అధికారపక్షంపై తమ దూకుడును కాస్త తగ్గించినట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/