Begin typing your search above and press return to search.

టీటీడీపీకి ఓదార్పు కావ‌లెను

By:  Tupaki Desk   |   25 Feb 2018 11:38 PM GMT
టీటీడీపీకి ఓదార్పు కావ‌లెను
X
తెలంగాణ టీడీపీ ప‌రిస్థితిని చూస్తున్న వారు చేస్తున్న కామెంట్ ఇది. ఒక‌నాడు అధికారంలో ఉన్న పార్టీ - అత్యంత బ‌లంగా ఉన్న పార్టీ అనే ముద్ర నుంచి ఇప్పుడు ఆన‌వాళ్లు మాత్ర‌మే మిగిలి భ‌విష్య‌త్‌పై ఏమాత్రం ఆశ‌లు లేని పరిస్థితుల్లో తెలంగాణ టీడీపీ ఉందని - ఆ పార్టీకి ఏక‌కాలంలో ఇటు ఓదార్పు అటు కార్య‌క‌ర్త‌లు కావాలంటున్నారు. తెలుగుదేశం పార్టీ ర‌థ‌సార‌థి వ్యూహాత్మ‌క త‌ప్పిదాలు - ప్ర‌త్య‌ర్థుల రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల నేప‌థ్యంలో టీటీడీపీ నామ్‌ కేవాస్తీగా మారిపోయింది. దీంతో తెలంగాణ టీడీపీ కార్యాలయం నిత్యం బోసిపోయి కనిస్తోంది.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు హైదరాబాద్‌ లో ఉంటే తప్ప నాయకులు కార్యాలయం ముఖం చూడని పరిస్థితి ఉంది. పార్టీ కార్యకర్తలకైతే అసలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉందనే విషయం తెలియకుండా పోయిందని ప‌లువురు ఎద్దేవా చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన రైతు ఆత్మహత్యలపై పోరుయాత్ర కార్యకర్తలు లేక వెలవెలబోయింది. పల్లెపల్లెకు తెలుగుదేశం నామమాత్రంగా సాగుతుందా లేదా అనే విష‌యంలోనూ అస్ప‌ష్ట‌తే! తెలంగాణవ్యాప్తంగా పార్టీ క్యాడర్ టీఆర్‌ ఎస్‌ లో చేరుతున్న నేపథ్యంలో టీటీడీపీ నేతలు వారిని కాపాడుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలతో మమేకమై ఉండాల్సిన నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారని ప‌లువురు నేత‌లు వాపోతున్నారు.

టీడీపీ ఇలా అయ్యేందుకు అనేక కార‌ణాలు ఉన్నాయంటున్నారు. పార్టీ అధినేత తీరు నచ్చక - చంద్రబాబు తెలంగాణ వ్యతిరేక తీరుపై నొచ్చుకుని టీడీపీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ ఎస్‌ లో చేరారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మునుప‌టి ఉత్సాహంతో లేరు. ఆయ‌న్ను ఓటుకునోటు కేసు తీవ్ర ఇర‌కాటంలో ప‌డేసింద‌ని అంటున్నారు. మరో ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య బీసీ సంక్షేమసంఘం పనుల్లో నిమగ్నమై పార్టీకి సమయం కేటాయించే పరిస్థితిలో లేరు. టీడీపీ సీనియ‌ర్ నేత‌ మోత్కుపల్లి నర్సింహులు ఇటీవల చంద్రబాబును విమర్శించినా ఆయనపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ అధినేత కనుసన్నల్లో ఉంటారనే ఆరోపణలున్నాయి. టీటీడీపీ వ్యవహారాలపై విజయవాడ కేంద్రంగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతీ సమస్యకు అక్కడకు వెళ్లాల్సి రావడం - వెళ్లినా అధినేత కోసం రోజుల తరబడి వేచిఉండాలి వస్తున్నదని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ నేత‌లే లైట్ తీసుకునే ప‌రిస్థితి ఉంద‌ని చెప్తున్నారు.