Begin typing your search above and press return to search.

టీడీపీ దుకాణం బంద్ అయినట్టే..ఓటమి పరిపూర్ణం!

By:  Tupaki Desk   |   11 Dec 2018 6:48 AM GMT
టీడీపీ దుకాణం బంద్ అయినట్టే..ఓటమి పరిపూర్ణం!
X
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దుకాణం బంద్ అయినట్టే అని అంటున్నారు పరిశీలకులు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పదిహేను ఎమ్మెల్యే సీట్లను సంపాదించుకుంది. అది చాలా గౌరవప్రదమైన విజయం. అందుకే చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీని కాపాడుకుంటానని అప్పట్లో ప్రకటించాడు. అయితే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కోవడం టీడీపీ గతిని మార్చేసింది. చంద్రబాబు నాయుడు విజయవాడకు పారిపోయాడని అనిపించుకున్నాడు.

ఇక జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తు అయ్యింది. కేవలం ఒకే ఒక డివిజన్ కు పరిమితం అయ్యింది తెలుగుదేశం పార్టీ. అప్పుడే టీడీపీ కథ ముగిసిందని అంతా అనుకున్నారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల సమయానికి మళ్లీ చంద్రబాబు నాయుడు ఇక్కడ దిగబడ్డాడు. తెరాసను ఓడిస్తానంటూ కాంగ్రెస్ పార్టీతో జత కట్టాడు.

ముందుగా తెరాసతో పొత్తుకే చంద్రబాబు ప్రయత్నించాడు. అది కుదరక కాంగ్రెస్ తో చేతులు కలిపాడు. దీంతో జనాలకు చంద్రబాబు గురించి మరింతగా అర్థం అయిపోయింది. బాబు పచ్చి అవకాశవాదిగా తేటతెల్లం అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా బుద్ది చెప్పారు తెలంగాణ ప్రజలు.

చంద్రబాబు నాయుడు ఎంతో చాణక్యంతో నందమూరి సుహాసినిని తెరపైకి తెచ్చాడని తెలుగుదేశం వర్గాలు చెప్పుకున్నాయి. తీరా ఆమె చిత్తు చిత్తుగా ఓడింది. గ్రేటర్ పరిధిలో, సైబరాబాద్ పరిధిలో ఎక్కడా తెలుగుదేశం పార్టీ కనీసం ఒక్క సీటును నెగ్గలేకపోయింది. ఖమ్మం పరిధిలో ఇద్దరు విజయం సాధించే అవకాశాలున్నాయి. వారిలో ఒకరు ఓటుకు నోటు కేసు నిందితుడు. ఒక మిగిలిన వ్యక్తి ఎన్నాళ్లు టీడీపీలో ఉంటాడో చెప్పలేం. ఈ పరిణామాలను బట్టి తెలంగాణలో టీడీపీ దుకాణం పూర్తిగా బంద్ అయినట్టే!