Begin typing your search above and press return to search.

ఈసారికి ఒక పచ్చ కండువా అయినా ఉంటుందా?

By:  Tupaki Desk   |   22 Oct 2017 4:16 AM GMT
ఈసారికి ఒక పచ్చ కండువా అయినా ఉంటుందా?
X
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజుల్లో మొదలు కాబోతున్నాయి. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఓ చిత్రమైన పరిస్థితి కనిపించబోతోంది. ఈ అసెంబ్లీలో కనీసం ఒక పచ్చ కండువా అయినా ఉంటుందా? అనే చర్చలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం నెలకొని ఉన్న ఫిరాయింపుల పర్వం పుణ్యమాని ఎవరు పార్టీలో ఉంటారో - ఎవరు ఉండరో.. ఎవరు ఎలాంటి పోకడలు పోతారో స్పష్టత లేదు. అసలే సభలో సంఖ్యాపరంగా కేవలం ముగ్గురంటే ముగ్గురే సభ్యులు ఉన్న తెలుగుదేశానికి.. ప్రాక్టికల్ గా సభ జరిగే సమయానికి అసలు ఆనవాళ్లు కనిపించకపోవచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

తెదేపా పరిస్థితులు రాష్ట్రంలోచాలా దయనీయంగా మారిపోతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు గానీ.. 12 మంది అధికార తెరాసలో చేరిపోయారు. చెప్పుకోడానికి పార్టీకి ఉన్నది ముగ్గురే ఎమ్మెల్యేలు. వారిలో ఒకరు ఆర్.కృష్ణయ్య తెలుగుదేశం పార్టీతో తనకు సంబంధమే లేదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇక మిగిలినది రేవంత్ రెడ్డి - సండ్ర వెంకటవీరయ్య. రేవంత్ రెడ్డి కాంగ్రెసులో చేరిపోతున్నారు. సండ్ర కూడా చాలా కాలంగా పార్టీ వ్యవహారాలకు అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారు. ఆయన తెరాసతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారనే పుకార్లు చాలా కాలం నుంచి ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సమావేశాల ముఖచిత్రం ఊహించుకుంటే చిత్రంగా కనిపిస్తోంది.

అసెంబ్లీ మొదటి రోజున అన్ని పార్టీల వారు తమ పార్టీ రంగుల కండువాలను ధరించి రావడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి అసెంబ్లీలో ఒక పచ్చకండువా కూడా ఉండకపోవచ్చునని జోకులు వినిపిస్తున్నాయి. రేవంత్ సంగతి ఓకే, కృష్ణయ్య ఎన్నడూ కండువా వేసుకునే వ్యక్తి కాదు. ఇక సండ్ర కూడా.. రాజకీయ లౌక్య నీతి పాటిస్తే.. తెలుగుదేశం రంగే సభలో కనిపించదని పలువురు మాట్లాడుకుంటున్నారు. తెరాస నాయకులు తమ మాటల్లో పలు సందర్భాల్లో.. తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ అసలెక్కడుంది? అదెప్పుడో అంతరించి పోయింది అని అంటూ ఉంటారు. రాష్ట్రంలో ఏమోగానీ.. శాసనసభలో మాత్రం ఖచ్చితంగా అంతరించిపోనుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.