Begin typing your search above and press return to search.

సండ్ర ఎక్క‌డ‌?...అంతా అయోమ‌యం

By:  Tupaki Desk   |   18 Jan 2019 4:45 PM GMT
సండ్ర ఎక్క‌డ‌?...అంతా అయోమ‌యం
X
తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున గెలిచిన కొత్త ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే టీఆర్ ఎస్‌ లోకి చేరేందుకు తట్టా బుట్టా సర్దేసుకున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఖ‌మ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య - అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పార్టీ మారుతారంటూ ఊహాగానాలు పెద్ద ఎత్తున్నే సాగాయి. అయితే, ఈ చేరిక హ‌ఠాత్తుగా ఆగిపోయింది. మెచ్చా నాగేశ్వ‌ర‌రావు తాను పార్టీ మార‌డం లేద‌ని ప్ర‌క‌టించారు. అయితే మ‌రో ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య ఇటు అసెంబ్లీకి రాక‌పోవ‌డం...అటు టీడీపీ స‌మావేశాల్లో పాల్గొన‌క‌పోవ‌డం..అదే స‌మ‌యంలో టీఆర్ ఎస్‌ లో చేర‌క‌పోవ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

టీడీపీ త‌ర‌ఫున గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల్లో ఒక‌రైన సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌ తన అనుచరులు - నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో సత్తుపల్లిలో సమావేశం ఏర్పాటు చేసుకొని టీఆర్ ఎస్‌ లో చేరిక‌కు సిద్ధ‌మైపోయినట్లుగా ప్ర‌చారం జ‌రిగింది. దీనికి సంబంధించి గులాబీ పార్టీలోని ముఖ్య నేతలతో సంప్రదింపులు కూడా చేసినట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అనంత‌రం ఆయ‌న అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో చ‌ర్చించి పార్టీ మార‌డంపై ప్ర‌తిపాదించారు. అయితే, సండ్ర ప్ర‌తిపాద‌న‌కు నాగేశ్వ‌ర‌రావు నో చెప్పినట్లు స‌మాచారం. ఇలా చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే అసెంబ్లీ స‌మావేశాలు వ‌చ్చాయి. ఈ స‌మావేశాల్లో తొలిరోజు - మ‌రుస‌టి రోజు కూడా సండ్ర స‌భ‌కు రాలేదు. ఆఖ‌రికి ఎమ్మెల్యేగా కూడా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌లేదు.

అదే స‌మయంలో టీడీపీ నేత‌ల కార్య‌క్ర‌మాల్లో కూడా ఆయ‌న పాల్గొన‌డం లేదు. దీంతో ఇటు టీఆర్ ఎస్ పార్టీలో చేర‌కుండా...అటు సొంత పార్టీలో కొన‌సాగ‌కుండా...మ‌రోవైపు పార్టీ నేత‌ల‌కు అందుబాటులో లేకుండా...సండ్ర ఊహించ‌ని ఉత్కంఠ‌ను సృష్టిస్తున్నార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో, ఇంత‌కీ సండ్ర ఎందుకీ ఉత్కంఠ‌ను సృష్టిస్తున్నార‌నే చ‌ర్చ కూడా తెర‌మీద‌కు వ‌స్తోంది.