Begin typing your search above and press return to search.

బాబు-కేసీఆర్ మధ్య దోస్తీకి ట్రై చేస్తోంది వీళ్లేనా?

By:  Tupaki Desk   |   20 Oct 2017 7:34 AM GMT
బాబు-కేసీఆర్ మధ్య దోస్తీకి ట్రై చేస్తోంది వీళ్లేనా?
X
తెలంగాణ రాజకీయాలు అనూహ్య మ‌లుపులు తిరుగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ అనంత‌పురం ప‌ర్య‌ట‌న‌తో మొద‌లైన ట్విస్టుల ప‌రంప‌ర...టీటీడీపీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేరువ అవుతుండ‌టంతో పీక్ స్టేజీకి చేరింది. కాంగ్రెస్ పార్టీతో రేవంత్ దోస్తీ అనూహ్య‌మైన ప‌రిణామాల‌కు వేదిక‌గా మారడంతో త‌దుప‌రి ప‌రిణామాణ‌ల‌పై అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. 2019లో తెలంగాణ‌లో టీడీపీ- టీఆర్ ఎస్‌ ల మ‌ధ్య దోస్తీ కుదురుతుందా? తెలంగాణ‌లో కుదేల‌యిపోయిన టీడీపీకి తిరిగి కేసీఆర్ జీవం పోస్తారా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎవ‌రు అవున‌న్నా..కాద‌న్నా..తెలంగాణ‌లో టీడీపీ నామ్‌ కేవాస్తీ అయిపోయింది. పార్టీలోని సీనియ‌ర్లంతా టీఆర్ ఎస్‌ కు జై కొట్ట‌డం...ఇన్నాళ్లు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ కు చేరువ అయిన నేప‌థ్యంలో టీటీడీపీలో నైరాశ్యం నెల‌కొంది. అయితే ఈ స‌మ‌యంలోనే గ‌తంలో తెచ్చిన ప్ర‌స్తావ‌న‌ను కొంద‌రు టీటీడీపీ నేత‌లు మ‌ళ్లీ తెర‌మీద‌కు తీసుకువ‌స్తున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణ‌లో బ‌తికిబ‌ట్ట‌కట్టేందుకు టీఆర్ ఎస్‌ తో పొత్తు పెట్టుకోవాల‌ని వారు ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు తెలుస్తోంది. టీడీపీ పొలిట్‌ బ్యూరో స‌భ్యుడు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు - తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.ర‌మ‌ణ వంటివారు టీఆర్ ఎస్‌ తో పొత్తుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. ఈ విష‌యాన్ని పార్టీ అధినేత చంద్ర‌బాబుకు సైతం చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు చెప్తున్నారు.

టీఆర్ ఎస్‌ తో పొత్తుకు అనుకూలంగా ఉన్న టీటీడీపీ నేత‌ల వాద‌న‌ల ప్ర‌కారం....ఏపీ మంత్రి ప‌రిటాల సునీత త‌న‌యుడి వివాహానికి వెళ్ల‌డం స‌హా కొన్ని చ‌ర్య‌ల‌ను విశ్లేషిస్తే...సీమాంధ్రుల‌కు చేరువ కావాల‌నేది కేసీఆర్ విధాన‌మ‌ని స్ప‌ష్ట‌మైపోయింది. మ‌రోవైపు సీమాంధ్రులు సైతం కేసీఆర్‌ ను గ‌తంలో లాగే శ‌త్రువుగా చూడ‌టం లేదు. ఈ నేప‌థ్యంలో టీఆర్ ఎస్‌ తో పొత్తు పెట్టుకోవాల‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్నార‌ట‌. మ‌రోవైపు టీఆర్ ఎస్‌ లోని కొంద‌రు నేతలు సైతం ఇదే భావ‌న‌లో ఉంద‌ని అంటున్నారు. టీడీపీకి ఇప్ప‌టికీ కొద్దొగొప్పో క్యాడ‌ర్ ఉండ‌టం, హైద‌రాబాద్‌ - ఖ‌మ్మం - నిజామాబాద్ వంటి జిల్లాల్లోని సెటిల‌ర్ల ఓట్ల‌ను చేరువ చేసుకోవ‌డం కోసం పొత్తు పెట్టుకోవ‌డం స‌రైన విధాన‌మ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో సానుకూలంగా ముందుకు సాగాల‌ని ఇద్ద‌రు చంద్రుల వ‌ద్ద ప్ర‌తిపాదించేందుకు కొంద‌రు నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో...ఏపీ సీఎం చంద్ర‌బాబు - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేతులు క‌లుపుతారా? స్వ‌రాష్ట్రం ఎజెండాతో ముందుకు పోయిన కేసీఆర్‌...త‌న మాజీ పార్టీకి వెలుగులు నింపే ప‌ని చేస్తారా అనేది ఆస‌క్తిగా మారింది.